మెగా ఫోన్ పట్టబోతున్న సూపర్ స్టార్

నటులు దర్శకులుగా మారడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. కానీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లు మాత్రం దర్శకత్వం జోలికి వెళ్లడం అరుదు. కథా చర్చల నుంచి మేకింగ్‌ వరకు ఎంత ఇన్వాల్వ్ అయినా సరే.. దర్శకత్వం మన పని కాదన్నట్లు దానికి దూరంగా ఉంటారు. ఐతే బాలీవుడ్‌లో ఇప్పుడో సూపర్ స్టార్ దర్శకత్వం చేయబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. అతనే.. రణబీర్ కపూర్.

మూడేళ్ల ముందు ‘యానిమల్’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కపూర్ వారసుడు.. ఇప్పుడు ‘రామాయణం’తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాను కొన్నేళ్లలో దర్శకుడిగా మారబోతున్నట్లు.. ఇందుకోసం కథలు రాసే పనిలో ఉన్నట్లు రణబీర్ తాజాగా వెల్లడించాడు.

‘‘దర్శకుడిగా ఒక కథను తెరపై ఆవిష్కరించడం గొప్పగ అనుభూతిని ఇస్తుంది. రెండు మూడేళ్లలో దర్శకుడిగా తొలి అడుగు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా తొలి సినిమా ఏ జానర్లో ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్ లాంటి వరల్డ్ క్లాసిక్స్.. అలాగే రాజ్ కుమార్ హిరాని తరహా సినిమాల్లాగా అందరికీ నచ్చే కుటుంబ కథా చిత్రం రూపొందించాలని ఉంది’’ అని రణబీర్ చెప్పాడు.

తాను నటుడిగా సంవత్సరానికి 100-125 రోజులు మాత్రమే పని చేస్తానని, కాబట్టి కథలు రాయడానికి బాగానే టైం దొరుకుతోందని రణబీర్ తెలిపాడు. నటుడిగా ఇంకో పదేళ్లు మాత్రమే కొనసాగొచ్చని చెప్పిన రణబీర్.. ఈ లోపే దర్శకుడిగా మారాలనుకుంటున్నానని చెప్పాడు.

తాను దర్శకత్వం వహించే చిత్రంలో తనే నటించాలనేమీ అనుకోవట్లేదని.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్ర-2, యానిమల్-2, రామాయణ-2 సినిమాలను పూర్తి చేసి దర్శకుడిగా తన తొలి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు రణబీర్ వెల్లడించాడు. ఈ నటుడి తర్వాతి చిత్రం ‘లవ్ అండ్ వార్’ జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ లీలా బన్సాలి ఆ చిత్రాన్ని రూపొందించాడు.