మలయాళంలో చాలా చిన్న వయసులో నటిగా గొప్ప పేరు సంపాదించింది అనస్వర రాజన్. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ దర్శకుడు జీతు జోసెఫ్ తీసిన ‘నేరు’ సినిమా చూస్తే ఆమె ఎంత గొప్ప పెర్ఫామరో అర్థమవుతుంది. ఇంకా మరెన్నో చిత్రాల్లో తన టాలెంట్ చూపించింది అనస్వర. ఈ అమ్మాయి గత ఏడాదే తెలుగులోకి కూడా అడుగుపెట్టింది.
శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరోగా రూపొందిన ‘ఛాంపియన్’లో నటనకు అవకాశమున్న మంచి పాత్రే చేసింది అనస్వర.
ఐతే ఆ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కంటెంట్ ఉన్న సినిమానే అయినా.. ప్రేక్షకులను పూర్తిగా స్థాయిలో మెప్పించలేకపోయింది ‘ఛాంపియన్’. డెబ్యూ మూవీ ఆడకపోయినా అనస్వరకు తెలుగులో అవకాశాలకైతే లోటు లేదు. టాలీవుడ్లో ఇంకొన్ని రోజుల్లో ఆమె టైం మొదలయ్యేలా కనిపిస్తోంది.
కొన్ని నెలల వ్యవధిలో మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది అనస్వర. ముందుగా వచ్చే శుక్రవారం ‘ఇట్లు అర్జున’తో రాబోతోందామె. అనీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మించాడు. దీని టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైనర్‌ను చూడబోతున్న సంకేతాలిచ్చాయి. అనస్వరకు కూడా ప్రాధాన్యమున్న పాత్రే దక్కినట్లుంది. ‘ఛాంపియన్’లో మాదిరి కాకుండా ఈసారి గ్లామర్ టచ్ కూడా ఉన్నట్లుంది.
దీని తర్వాత సంక్రాంతికి ‘కాకా’ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పలకరించబోతోంది అనస్వర. అందులో ఆమె చిరంజీవి కూతురి పాత్ర చేస్తుండడం విశేషం. కథలో తన పాత్ర ఎంతో కీలకమట. అది హిట్టయితే తన కెరీర్ గొప్ప మలుపు తిరుగుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు వరుస హిట్లతో దూసుకెళ్తున్న యంగ్ హీరో సంగీత్ శోభన్‌తో ఆమె ‘అంతా రాములోరు చూసుకుంటారు’ సినిమా చేస్తోంది. దాని టీజర్ కూడా ప్రామిసింగ్‌గా కనిపించింది. అనస్వర చేతిలో ఇంకా రెండు మూడు చిత్రాలు ఉన్నట్లు సమాచారం. ‘ఇట్లు అర్జున’ హిట్టయిందంటే తనకు డిమాండ్ మరింత పెరగడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates