‘ఆర్ఆర్ఆర్’ నటి సంచలన పోస్ట్.. కానీ వెంటనే


అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రకంపనలు కొనసాగుతుండాలి. ఈ నెల 8న ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది. కానీ కరోనా వచ్చి అందుకు అవకాశం లేకుండా చేసింది. ఈ మహమ్మారి వల్ల ఆరు నెలలకు పైగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆగిపోయింది. గత ఏడాది అక్టోబరులో షూటింగ్ పున:ప్రారంభించిన చిత్ర బృందం.. విరామం లేకుండా చిత్రీకరణ సాగిస్తోంది. ఇటీవలే క్లైమాక్స్ షూట్ కూడా మొదలైన సంగతి తెలిసిందే.

ఐతే ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ ఇచ్చి మళ్లీ మార్చుకున్న నేపథ్యంలో ఈసారి షూటింగ్ మొత్తం పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడితే కానీ విడుదల తేదీ గురించి మాట్లాడొద్దని రాజమౌళి అండ్ కో ఫిక్సయినట్లుంది. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌పై ఎలాంటి సమాచారం లేదు. కొందరేమో ఈ ఏడాది దసరాకు సినిమా రిలీజవుతుందని అంటుంటే.. కొందరేమో వచ్చే ఏడాది సంక్రాంతి అంటున్నారు.

ఇలాంటి సమయంలో ‘ఆర్ఆర్ఆర్’లో భాగమైన ఓ నటి ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నట్లు పోస్ట్ పెట్టడం సంచలనం రేపింది. ఐతే దర్శకుడు రాజమౌళి అనుమతి లేకుండా తాను అత్యుత్సాహం ప్రదర్శించానని అర్థం చేసుకున్న ఆమె.. కాసేపటికే పోస్ట్ డెలీట్ చేసింది. కానీ ఈ లోపే ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ నటి ఎవరంటారా..? ‘ఆర్ఆర్ఆర్’లో నెగెటివ్ రోల్ చేస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ. ఈమె హాలీవుడ్ చిత్రాల్లో ముఖ్య పాత్రలతో సత్తా చాటుకుంది.

‘ఆర్ఆర్ఆర్’ కథ బ్రిటిష్ కాలంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యమైన ఓ నెగెటివ్ రోల్‌లో డూడీ నటిస్తోంది. ఆమె పాత్ర పేరు.. స్కాట్ అంటున్నారు. కొన్ని నెలల ముందు నుంచే ఆమె ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో ఆమె పాల్గొంటోంది. మరి రిలీజ్ గురించి ఆమెకెవరు సమాచారం ఇచ్చారో.. ఆమె ఎందుకు అంత ఉత్సాహం ప్రదర్శించిందో కానీ.. ఆ పోస్ట్ చూశాక దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రావడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)