విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో గత ఏడాది మొదలైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను ముందు ఈ సంవత్సరం వేసవికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబరుకు వాయిదా పడింది. ముందేమో అక్టోబరు 2న రిలీజ్ అన్నారు. తర్వాత 9కి వాయిదా వేశారు. చివరికి ఆ డేటుకి కూడా సినిమా విడుదల కాలేదు. మరోసారి వాయిదా పడి ఇప్పుడు అక్టోబరు 30న రిలీజైంది. ఐతే దసరా సీజన్‌ను మిస్ చేసుకోవడం కాస్ట్లీ మిస్టేక్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.
అక్టోబరు 9 నుంచి వాయిదా వేయడం సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని చాలా వరకు తగ్గించేసిందన్నది వాస్తవం. అప్పుడున్న ఉత్సాహం తర్వాత కనిపించలేదు. పైగా ఇప్పుడు సెలవులు కూడా లేవాయె. అందుకే ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో రిలీజైన సినిమా అయినా.. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. డే-1 మార్నింగ్ షోలకు సరైన ఆక్యుపెన్సీలు లేని పరిస్థితి.
ఐతే సాయంత్రానికి పరిస్థితి మారింది. ఆక్యుపెన్సీలు పెరిగాయి. అయినా సరే.. డే-1 ఓవరాల్ కలెక్షన్లు కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లు లేవన్నది వాస్తవం. దీన్ని బట్టే రిలీజ్ డేట్ టైమింగ్ అన్నది సినిమాకు చాలా మైనస్ అయిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. చెప్పినట్లు 9న రిలీజ్ చేసి ఉంటే.. అప్పుడు ప్రేక్షకుల్లో ఉన్న జోష్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగేవి. సరిగ్గా దసరా సెలవులు మొదలవడానికి ముందు రిలీజై ఉంటే రెండు వారాల పాటు బాక్సాపీస్ దగ్గర దూసుకెళ్లేది.
ఇప్పుడు వచ్చినట్లే యావరేజ్ టాకే వచ్చినా సరే.. ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేవాళ్లు. జైలర్-2, రణబాలి సినిమాల పోటీని తట్టుకుని కూడా సినిమా బాగా ఆడేది. కలెక్షన్లు ఇప్పుడు వచ్చే మొత్తం మీద కనీసం 50 శాతం ఎక్కువ ఉండేవి. ఇంకా ఎక్కువ వచ్చి ఉన్నా ఆశ్చర్యం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో ఇంకాస్త అప్రమత్తంగా ఉండి ఉంటే.. నిర్మాత, బయ్యర్లు మంచి లాభాలు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ టాక్, ఈ ఓపెనింగ్స్‌తో సినిమా బ్రేక్ ఈవెన్ కావడమే కష్టమనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates