మెగా ఫ్యామిలీలో ఇంకో పెళ్ళి వేడుక?

టాలీవుడ్లో అత్యధికంగా హీరోలున్న కుటుంబం.. మెగా వారిదే. అందులో చాలామంది యూత్ ఉన్నారు. వారిలో ఒక్కొక్కరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టేస్తున్నారు. మూడేళ్ల ముందు వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిని పెళ్ళాడాడు. ఈ ఏడాది అల్లు శిరీష్‌కు నయనికతో వివాహం జరిగింది. వీళ్లిద్దరి కంటే పెద్దవాడైన సాయిధరమ్ తేజ్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. మామూలుగా అయితే ఈపాటికే అతడికి పెళ్లయిపోయి ఉండేదేమో.

కానీ మధ్యలో యాక్సిడెంట్ వల్ల గ్యాప్ పెరిగింది. ఐతే 40 ఏళ్ల తేజు.. ఎట్టకేలకు తన తోడును వెతుక్కున్నట్లు సమాచారం. అతను డిసెంబరులో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. అతను తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నవంబరులోనే ఎంగేజ్మెంట్ జరగనుందట. తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా పెళ్లి కూడా కూడా చేసుకోనున్నాడట.

చిన్ననాటి స్నేహితురాలితో తేజు పెళ్లి అనేసరికి వధువు ఎవరా అని సోషల్ మీడియా జనాలు వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా లేదు. తేజు కెరీర్ విషయానికి వస్తే.. తన కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, సుదీర్ఘ కాలం చిత్రీకరణ దశలోనే ఉన్న ‘సంబరాల యేటి గట్టు’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తారని ప్రకటించారు కానీ.. ఆ డేట్‌కు సినిమా రావడం సందేహంగానే ఉంది.

వైవీఎస్ చౌదరి సినిమా ‘రేయ్’తో తేజు హీరోగా పరిచయం కావాల్సింది. కానీ ముందు మొదలుపెట్టింది ఆ చిత్రమే అయినా.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో అతను హీరో అయ్యాడు. ‘రేయ్’ తర్వాత రిలీజై డిజాస్టర్ అయినప్పటికీ.. పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలు విజయవంతం కావడంతో తేజు మంచి ఇమేజ్ సంపాదించాడు. మంచి ఊపులోనే సాగుతున్న తేజు కెరీర్.. యాక్సిడెంట్ వల్ల కొంచెం స్లో అయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘విరూపాక్ష’తో తేజు మంచి విజయాన్నందుకున్నాడు. ఇప్పుడు ‘సంబరాల యేటిగట్టు’తో తన కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని అంచనా వేస్తున్నారు.