డేంజర్ గేమ్ ఆడుతున్న విశ్వంభర

ఒకవైపు కాకా పదే పదే జనవరి 13 విడుదల అవుతుందంటూ టీమ్ సోషల్ మీడియాలో ఒకటే ఊరిస్తోంది. ఇంకోవైపు విశ్వంభర వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. సంక్రాంతికి ఇదే వస్తుందని ఆ మధ్య ఓ వారం రోజుల పాటు చెవులు హోరెత్తేలా పుకార్లు షికారు చేశాయి. అందులో కొంత నిజమైతే ఉంది. ఓటిటి డీల్ వల్ల ఖచ్చితంగా పండక్కు రావాలని నిర్ణయించుకుందని ప్రచారం జరిగింది. కానీ యువి నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడం అభిమానులు మళ్ళీ దాని గురించి మర్చిపోయారు.

ఇక్కడ మొత్తం ఇష్యూలో విశ్వంభర చాలా డేంజర్ గేమ్ ఆడుతోంది. ఇప్పటికే తగ్గిపోయిన బజ్ పెంచే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కాకా జనవరిలో వచ్చినా మెగా ఫాంటసీ మూవీ ఎప్పుడు వస్తుందనేది అర్జెంట్ గా నిర్ణయించుకోవాలి. మార్చి కావొచ్చు లేదా అంతకన్నా ఆలస్యంగా వేసవిలో ఉండొచ్చు. ముందైతే ఫలానా టైంలో అంటూ ఏదైనా పోస్టర్లు లాంటివి వదలడం చేయాలి. దసరా, దీపావళి పండగలు ఎలాంటి అప్డేట్ లేకుండా గడిచిపోయాయి.

తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో మరో పుకారు తిరుగుతోంది. కాకా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేశాక అప్పుడు విశ్వంభర డేట్ అనౌన్స్ చేస్తారని, ఒకవేళ ఏదైనా కారణం వల్ల కాకా కనక రాలేకపోతే అదే బయ్యర్ల ద్వారా విశ్వంభరని రిలీజ్ చేయించే ఆలోచన చేస్తున్నారని దాని సారాంశం. ఇది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మార్కెట్ లో కాకాకున్న డిమాండ్ వేరు. కంటెంట్ గురించి లీకులు, పోస్టర్లు ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. విశ్వంభరకి అంత సీన్ ఇప్పటికైతే లేదు.

ఒకపక్క మెగావర్స్ టాక్ షోలో బిజీగా ఉన్న చిరంజీవి ఇంకో వారం పది రోజుల తర్వాత ఫ్రీ అవుతారట. ప్రస్తుతం కాకా షూటింగ్ జరుగుతోంది. కొత్త షెడ్యూల్ వికారాబాద్ లో మొదలవుతోందని టాక్. ఇంకా టాకీ పార్ట్ తో పాటు రెండు పాటలు బాలన్స్ ఉన్నాయని అంటున్నారు. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడి  దాకా వచ్చిందో మటుకు క్లారిటీ లేదు. గౌర హరి రీ రికార్డింగ్ కూడా అయిపోయిందని తెలిసింది. అయినా సరే ఎలాంటి ఊసు లేదు. మరి ఎప్పుడు చెబుతారో ఏమిటో.