వారణాసి తెలుగు బిజినెస్ అంత పలికిందా

ఖచ్చితంగా విడుదల తేదీలో మార్పు ఉండదనే దిశగా సంకేతాలు వస్తున్నాయి కాబట్టి వారణాసి రిలీజ్ కాబోయే ఏప్రిల్ 7 కోసం మహేష్ బాబు అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. రాజమౌళి ప్రస్తుతం కాలభైరవ పెళ్లి పనులతో పాటు తన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. షూటింగ్ దాదాపుగా అయిపోవడంతో మహేష్ బాబు మెల్లగా చిల్ అవుతూ త్వరలో జక్కన్న మొదలు పెట్టబోయే భారీ ప్రమోషనల్ క్యాంపైన్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉండగా ఏపీ తెలంగాణ వారణాసి హక్కులను మైత్రి సంస్థ స్వంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. సుమారు రెండు వందల డెబ్భై కోట్లకు పైగానే డీల్ జరిగిందట. అంటే దీనికి రెట్టింపు గ్రాస్ కేవలం రెండు రాష్ట్రాల నుంచే రావాలి. హైప్ కోణంలో చూసుకుంటే ఇదేం అసాధ్యం కాదు. అదిరిపోయింది, మెంటల్ మాస్ అనిపించుకునే టాక్ తో, భారీ టికెట్ రేట్ల పెంపుతో సాధ్యం చేయొచ్చు. కాకపోతే బాహుబలి, ఆర్ఆర్ఆర్ ని మించిన యునానిమస్ వస్తేనే టార్గెట్ రీచ్ అవ్వొచ్చు.

ప్రస్తుతానికీ న్యూస్ గాసిప్ స్టేజిలోనే ఉంది కాబట్టి అప్పుడే నిర్ధారణగా చెప్పలేం కానీ మొత్తానికి ఒక్కొక్కటిగా బిజినెస్ వ్యవహారాలు చక్కబడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. హిందీ ఇతర బాషల చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ట్రైలర్ రాలేదు కాబట్టి సినిమా ఏ స్కేల్ లో ఉంటుందనే దాని మీద నార్త్ బయ్యర్లు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. రాజమౌళి మీద ఎంత నమ్మకం ఉన్నా తాము పెట్టబోయే భారీ పెట్టుబడికి ఆ ఒక్క అంశాన్నే ప్రాతిపదికగా తీసుకోలేరుగా.

ఇప్పటికైతే వారణాసి ఆన్ ట్రాక్ ఉన్నట్టే. ఓటిటి డీల్ కూడా త్వరలోనే క్లోజ్ కావొచ్చని వినికిడి. ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ అడ్వెంచర్ డ్రామాలో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. మొదటిసారి రాముడు, కుంభకర్ణుడి మధ్య కాంఫ్లిక్ట్ ని తెరమీద పెద్ద స్థాయిలో ఆవిష్కరించబోతున్న రాజమౌళి అంచనాలకు మించి అద్భుతమైన కంటెంట్ ఇస్తారని టీమ్ నుంచి వినిపిస్తున్న మాట. అదే నిజమైతే మటుకు వరల్డ్ వైడ్ మూడు వేల కోట్లని లక్ష్యంగా పెట్టుకోవచ్చు.