రామాయ‌ణం డైరెక్ట‌ర్ కూడా తెలుగు సినిమా పిచ్చోడే

ఇత‌ర భాష‌లకు చెందిన సినీ జ‌నాలు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కొంచెం క‌ష్ట‌ప‌డి బాగున్నారా అని.. అంద‌రికీ న‌మ‌స్కారం అని వ‌చ్చీ రాని తెలుగులో మాట్లాడుతుంటారు. కొంత కాలం ఇక్క‌డి సినిమాల్లో ప‌ని చేశాక తెలుగు నేర్చుకునేవాళ్లూ ఉంటారు. కానీ అస‌లు తెలుగు సినిమాతో సంబంధం లేని ఒక బాలీవుడ్ ద‌ర్శ‌కుడు.. హైద‌రాబాద్‌కు వ‌చ్చి త‌న సినిమా ఈవెంట్లో తెలుగు పాట పాడడం మాత్రం అరుదైన విష‌యమే.

సోమ‌వారం ఇదే ప‌ని చేసి పెద్ద షాకిచ్చాడు దంగ‌ల్ మూవీ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి. ఆయ‌న తాజాగా రామాయ‌ణం లాంటి మెగా మూవీని రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌బీర్ క‌పూర్, సాయిప‌ల్ల‌వి, య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా వ‌చ్చే నెల 5న విడుద‌ల కానుంది. తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్లో నితీశ్ తివారి స్పీచ్, ఆయ‌న పాట హైలైట్‌గా నిలిచాయి. తెలుగు సినిమాల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. తాను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో నాగార్జున మూవీ శివ చూశాన‌ని… ఆ తర్వాత చిరంజీవి హిందీలో చేసిన ప్రతిఘటన వీక్షించాన‌ని నితీశ్ గుర్తు చేసుకున్నాడు. అలాగే రాజ‌మౌళి తీసిన‌ మ‌గ‌ధీర‌, ఈగ సినిమాల‌ను తెలుగులోనే చూశాన‌ని.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌ను హిందీలో చూసే అవ‌కాశం రాజ‌మౌళి ఇచ్చాడ‌ని నితీశ్ తెలిపాడు.

ఈ సంద‌ర్భంగా గీతాంజ‌లి సినిమాలోని నంది కొండ వాగుల్లోన పాట‌ను ఆల‌పించ‌డ‌గా.. ఆడిటోరియం హోరెత్తిపోయింది. అక్క‌డ‌క్క‌డా కొంచెం ప‌దాలు గుర్తు రాక ఇబ్బంది ప‌డ్డ‌ప్ప‌టికీ.. నితీశ్ ఈ పాట పాడ‌డం మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ వేడుక‌లో సాయిప‌ల్ల‌వి, య‌శ్‌ల ప్ర‌సంగాలు అంద‌రినీ అమితంగా ఆక‌ట్టుకున్నాయి