దేవరకొండ జంటను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు

ఇవాళ రణబాలి థియేటర్లలో అడుగు పెట్టింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినపప్పటికీ కంటెంట్ మీద నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ మంచి రిలీజ్ వచ్చేలా చూసుకుంది. జైలర్ 2 రూపంలో గట్టి పోటీ ఎదురుగా ఉన్నప్పటికీ నెరవకుండా ముందుకు వెళ్లిపోయారు. శ్యామ్ సింగ రాయ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు రాహుల్ సంక్రుత్యాన్ ఈ ప్రాజెక్టు మీద మూడేళ్లకు పైగా సమయం ఖర్చు పెట్టారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ప్రాథమికంగా వచ్చిన ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే పెళ్ళైన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడిగా వచ్చిన మొదటి సినిమా కావడంతో అభిమానులు ప్రత్యేకంగా భావించారు. స్వాతంత్రం రాక ముందు రాయలసీమ అనంతపురం ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర కరువులో, బ్రిటిషర్ల ఆగడాల మీద పోరాడిన వీరుడి కథే ఈ రణబాలి. మూడు గంటల నిడివికి దగ్గరగా ఉన్నప్పటికీ ఎమోషన్స్ ని బలంగా చెప్పాలనే ఉద్దేశంతో దర్శకుడు రాహుల్ నిడివి విషయంలో రాజీ పడినట్టు లేదు.

సినిమా ఎలా ఉందనేది పక్కనపెడితే విజయ్, రష్మిక మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. భర్త ఎలాంటి వాడో తెలియకుండా కోడలిగా పెద్దింటికి వచ్చిన అమ్మాయి ముందు తన పెనిమిటిని అపార్థం చేసుకుని, తర్వాత అతగాడి గొప్పదనం రియలైజ్ అయ్యే పాత్రలో రష్మిక మందన్న బెస్ట్ ఇచ్చింది. అలాగే విజయ్ కోపంతో రగిలిపోయే రణబాలిగా ఒక వైపు వయొలెన్స్, ఇంకో వైపు ఎమోషన్స్ డిమాండ్ చేసే ఎపిసోడ్స్ ఇంటెన్సిటీ బాగానే బ్యాలన్స్ చేసిన వైనం కనిపించింది.

బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా రణబాలి ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది. అయితే దేవరకొండ జంటకు ఏదో రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా ఇలాంటి డెప్త్ ఉన్న పీరియాడిక్ సెటప్ ఉన్న సినిమా దక్కడం ఒకరకంగా అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే రిజల్ట్ హిట్టా ఇంకొకటానేది పక్కన పెడితే ఇది లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతుంది. వీళ్లిద్దరి మధ్య డైలాగులు, చిలిపి తగాదాలు, భావోద్వేగాలు దర్శకుడు రాహుల్ బాగా డిజైన్ చేసుకున్నారు.