ఒక గుడిని ఆధారంగా చేసుకుని అల్లుకున్న సినిమాలు కొత్తేమీ కాదు. కార్తికేయ నుంచి మహేంద్రగిరి వారాహి దాకా ఈ మధ్య కాలంలో ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. అయినా సరే అధిక శాతం వీటిలో ఆదరణ పొందుతున్నవే ఎక్కువ. అందుకే దర్శక నిర్మాతలు ఈ జానర్ వైపు మొగ్గు చూపుతూనే ఉన్నారు ఈ సిరీస్ లో భాగంగా వస్తున్న మరో డివోషనల్ డ్రామా హైందవ. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రూపొందిన ఈ మూవీకి లుదీర్ బైరెడ్డి దర్శకత్వం వహించగా సామ్ సిఎస్ సంగీతం అందించారు.
కథను చాలా స్పష్టంగా అరటిపండు వలిచినట్టు చెప్పేశారు. రంగాపురంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయానికి చెందిన విగ్రహాలు ఒక రాత్రి దొంగతనానికి గురవుతాయి. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) పరమ నాస్తికుడు. ఇవి చేస్తోంది మనుషులేనని బలంగా నమ్మి జనం మూఢ నమ్మకాలను తగ్గించే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని అనూహ్య సంఘటనలు అతని ఆలోచనలను, ప్రయాణాన్ని మారుస్తాయి. ప్రమాదాలు స్వాగతం చెబుతాయి.
ఈ తరహా బ్యాక్ డ్రాప్ కొత్త కాకపోయినా కథనంలో చూపించిన ఇంటెన్స్ డ్రామా, విజువల్స్ ఆసక్తి రేపేలా ఉన్నాయి. విలన్ గా జెడి చక్రవర్తిని చూపించడం బాగుంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా పాస్ అయ్యేలానే ఉంది. ఖాకీ దుస్తుల్లో కనిపించడం సాయి శ్రీనివాస్ కు కొత్త కాదు కానీ ఈ తరహా యాంటీ డివోషనల్ టచ్ డిఫరెంట్ గా అనిపిస్తోంది. హీరోయిన్ సంయుక్త మీనన్ రెగ్యులర్ గా కాకుండా స్టోరీలో ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ దక్కించుకున్నట్టు పాత్ర డిజైన్ చూసి అర్థం చేసుకోవచ్చు.
నవంబర్ 27 విడుదల కాబోతున్న హైందవ తక్కువ గ్యాప్ లో రష్మిక మందన్న మైసాతో తలపడనుంది. ఫౌజీ తప్పుకోవడంతో డిసెంబర్ మొదటి వారం కొత్త రిలీజులతో ప్యాక్ అయిపోయింది. సో హైందవకు గట్టి సవాళ్ళే ఎదురు కాబోతున్నాయి. కిష్కిందపురి మంచి సక్సెస్ అయినా భైరవంతో ఫ్లాప్ చవి చూసిన సాయిశ్రీనివాస్ మళ్ళీ ట్రాక్ లో పడేందుకు హైందవ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇంకా నెలన్నరకు పైగా సమయం ఉంది కాబట్టి పబ్లిసిటీని టీమ్ చక్కగా ప్లాన్ చేసుకోనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates