ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే దూకుడు ఈసారి అంత కనిపించకపోయినా టాక్ వచ్చాక పరిస్థితిలో అనూహ్య మార్పు వస్తుందని టీమ్ బలంగా నమ్ముతోంది. తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఏ మాత్రం బాగుందనే మాట వినిపించినా థియేటర్లు కళకళలాడటం ఖాయం. ఇక పెద్ద గండం దాటడం ఏమిటనే పాయింట్ కు వద్దాం.
రణబాలికి సెన్సార్ యు/ఏతో సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే వయసు నిబంధన లేకుండా చిన్నా పెద్దా అందరూ చూడొచ్చు. నిజానికి ట్రైలర్ లో చూపించిన వయొలెన్స్ సినిమాలో ఇంకా అధిక మోతాదులో ఉంటుందేమోననే అనుమానం ఆడియన్స్ కి వచ్చింది. అయితే ఇది ఎమోషనల్ కనెక్షన్ కు సమస్య మారొచ్చని భావించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ముందుచూపుతో హింస మోతాదుని తగ్గించి భావోద్వేగాల మీద దృష్టి వచ్చేలా ఎడిట్ చేయించడంతో సమస్య తగ్గింది.
పైగా స్వాతంత్రం రాకముందు నేపధ్యం కాబట్టి బ్రిటిషర్లు పెట్టిన హింసని అంతో ఇంతో తెరమీద చూపించాల్సి ఉంటుంది. వయొలెన్స్ డోస్ మించకుండా ఉంటే చాలు. రాహుల్ అదే చేసినట్టు ఉన్నారు. ఈ మధ్య టైటిల్ తో మొదలుపెట్టి కంటెంట్ వరకు సెన్సార్ నుంచి చాలా సినిమాలు అభ్యంతరాలు ఎదురుకున్నాయి. దండోరా నుంచి కామ్రేడ్ కళ్యాణ్ వరకు ఫేస్ చేసిన వాళ్ళ కౌంట్ పెద్దదే. కానీ రణబాలికి అంత తీవ్రంగా అబ్జెక్షన్లు రాకపోవడం మంచి పరిణామమే.
విజయ్ దేవరకొండకు దీని సక్సెస్ చాలా కీలకం. ప్రాణం పెట్టి కష్టపడ్డారు. గీత గోవిందం లాగా ఏదో ఆడుతూ పాడుతూ చేసిన క్యారెక్టర్ కాదిది. పెర్ఫార్మన్స్, ఫిజికల్ ఎఫర్ట్ రెండు డిమాండ్ చేయడంతో ఎంత ఆలస్యమైనా దీని కోసం తన బెస్ట్ ఇచ్చాడు. హిట్టు కొడితే ఈసారి సౌండ్ బాలీవుడ్ లోనూ వినిపిస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాకు అజయ్ అతుల్ సంగీతం సమకూర్చారు. రెండు గంటల యాభై నిమిషాల ఫైనల్ వెర్షన్ లాకయ్యిందని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates