మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా ఆశలే పెట్టుకుంది. ఇది ‘బాహుబలి’ స్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో చర్చనీయాంశం అవుతుందంటూ పెద్ద స్టేట్మెంట్లే ఇచ్చారు మేకర్స్. ట్రైలర్లో మహేష్ బాబు కూడా తమ సంస్థ గర్వంతో ప్రెజెంట్ చేస్తున్న మూవీ అని చెప్పుకున్నాడు. తీరా చూస్తే ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు.
కొంతమందికి సినిమా విపరీతంగా నచ్చింది. అద్భుతం అన్నారు. కానీ మెజారిటీ ప్రేక్షకులు తిరస్కరించారు. కమర్షియల్‌గా సినిమా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఓటీటీలో రిలీజయ్యాక దీన్ని ఒక కల్ట్ మూవీగా చాలామంది అభివర్ణించారు. ఐతే కేవలం ప్రశంసలు లభిస్తే సరిపోదు కదా.. కమర్షియల్ సక్సెస్ దక్కితేనే ఏ సినిమా మేకర్స్‌కు అయినా సంతోషం.
ఐతే ‘రావు బహదూర్’ అనుకున్నట్లు ఆడకపోయినా.. దర్శకుడు వెంకటేష్ మహాతో అదే నిర్మాతలు మరో సినిమాకు సిద్ధమయ్యారు. వెంకటేష్ కూడా తన చివరి సినిమా అనుకున్నంత ఆడలేదే అని బాధలో ఉండిపోకుండా వెంటనే సినిమా మొదలుపెట్టేశాడు. అప్పుడే ఈ సినిమాకు టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసేశారు. ‘అట్టహాసం’ అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రంలో తానొక హీరోగా నటిస్తున్న సంగతి కూడా ఫస్ట్ లుక్‌తో బయటపెట్టేశాడు. అతడికి జోడీగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్రవంతి పెపకాయల నటిస్తుండడం విశేషం.
మహా దర్శకత్వం వహించిన కంచెర్లపాలెం ఎంత మంచి గుర్తింపు పొందిందో తెలిసిందే. ఇప్పుడు అదే బ్యాక్ డ్రాప్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రంలో మరో హీరోగా కార్తీక్ రత్నం, అతడికి జోడీగా ‘పుష్ప-2’ ఫేమ్ పావని కరణం నటిస్తున్నారు. మంచి టైటిల్, కలర్ ఫుల్ ఫస్ట్ లుక్‌తో వెంకటేష్ మహా ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే వేశాడు. ఐతే ఈసారి అతను క్రిటికల్ అక్లైమ్‌కు పరిమితం కాకుండా కమర్షియల్‌గానూ సక్సెస్ అందుకునే సినిమా అందిస్తాడని ఆశిద్దాం. ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణారెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి నిర్మించగా.. ‘రావు బహదూర్’ సంగీత దర్శకుడు స్మరణ్ సాయినే దీనికీ పని చేస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates