‘నెట్ ఫ్లిక్స్’కు ‘ఆహా’ పంచ్


ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. తెలుగులోకి అడుగు పెట్టడానికి చాలా సమయమే తీసుకుంది. హిందీలో కొన్నేళ్ల ముందు నుంచే ఆ సంస్థ వెబ్ సిరీస్‌లు రూపొందిస్తోంది. ‘సేక్ర్డ్ గేమ్స్’ సహా చాలా ఒరిజినల్సే వచ్చాయి ఆ సంస్థ నుంచి. తమిళంలో సైతం కొన్ని సిరీస్‌లు నిర్మించింది. మరికొన్ని లైన్లో ఉన్నాయి. కానీ తెలుగులో నెట్ ఫ్లిక్స్ఓ సిరీస్ తీయడానికి మాత్రం చాలా సమయం పట్టేసింది.

‘బాహుబలి’కి కొనసాగింపుగా అనుకున్న సిరీస్ ఎంతకూ తేలలేదు. ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్ సైతం పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ సిరీస్ పూర్తయింది. ‘పిట్ట కథలు’ పేరుతో తెరకెక్కిన ఈ ఒరిజినల్ సిరీస్‌కు ప్రిమియర్స్ కూడా ఖరారయ్యాయి. ఫిబ్రవరి 19న విడుదలకు ముహూర్తం కూడా పెట్టేశారు. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

శ్రుతి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బా, మంచు లక్ష్మి, జగపతిబాబు, సత్యదేవ్ లాంటి ప్రముఖ తారాగణం ఉన్న ఈ సిరీస్‌ను నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి లాంటి ప్రముఖ ఫిలిం మేకర్స్ రూపొందించారు. బోల్డ్‌గా ఉంటూనే థ్రిల్ చేసేలా ఈ సిరీస్ ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఐతే ఈ సిరీస్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేనున్న నేపథ్యంలో ‘నెట్ ఫ్లిక్స్’ వాళ్లు రెండు రోజులుగా కొంత హడావుడి చేస్తున్నారు. తెలుగులో ట్వీట్లు వేస్తూ.. ‘పిట్ట కథలు’ గురించి ఊరిస్తున్నారు. టీజర్ రిలీజ్ నేపథ్యంలో ఆ హడావుడి ఇంకొంచెం పెరిగింది. ఇది తెలుగు వారి ఓటీటీ ‘ఆహా’ టీంకు నచ్చనట్లుంది.

‘నెట్ ఫ్లిక్స్’ వాళ్లకు కౌంటర్ ఇచ్చేలా ఒక ట్వీట్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ‘ఆహా’ ట్విట్టర్ టీం. ‘‘నెట్ ఫ్లిక్స్’ ఒరిజినల్ త్వరలో మీ ముందుకు’’ అంటూ పెట్టిన ట్వీట్‌కు కౌంటర్‌గా.. ‘‘మా దగ్గర చాలా ఒరిజినల్స్ ఉన్నాయి అరుస్తున్నామా’’ అంటూ ‘జులాయి’లో ఓ డైలాగ్‌ను గుర్తు చేసేలా పంచ్ వేసి ట్విట్టర్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది ‘ఆహా’. ఇది చూసి నెట్ ఫ్లిక్స్ వాళ్లు తెలుగులో ఎట్టకేలకు ఒక సిరీస్ తీసుకొస్తుంటే ‘ఆహా’కు ఈ ఉలికిపాటు ఎందుకో అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.