కంగనా రనౌత్ బీభత్సం

బాలీవుడ్లో ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే కంగనా రనౌతే. ‘క్వీన్’తో మొదలుపెట్టి ‘మణికర్ణిక’ వరకు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమాలు మంచి విజయమే సాధించాయి. ఆమె స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసి చాలా కాలం అయిపోయింది. రెగ్యులర్ హీరోయిన్ల రోల్స్‌కు ఎప్పుడో చెక్ పెట్టేసిన కంగనా.. తన ఇమేజ్‌ను నమ్ముకుని హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ పోతోంది.

తమిళంలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ని పూర్తి చేసిన కంగనా.. ‘తేజస్’ పేరుతో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీని కంటే ముందు కంగనా ‘దాకడ్’ అనే సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.

‘దాకడ్’ ఫస్ట్ లుక్‌లో కంగనాను చూసి జనాలు ఒక్కసారిగా షాకైపోతున్నారు. అందులో ఆమె అంత వయొలెంట్‌గా కనిపిస్తోంది మరి. కత్తి పట్టి ఒక్కొక్కరిని అడ్డంగా నరుకుతూ దూసుకెళ్తోందామె. తెర అంతా రక్తపాతమే కనిపిస్తోంది. ఈ భయానక లుక్ చూసి కంగనా ఏంటి ఇలాంటి సినిమా చేస్తోందని ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రంలో కంగనా ఏజెంట్ అగ్ని పాత్రలో కనిపించనుంది.

దేశం కోసం పని చేసే రహస్య ఏజెంట్ పాత్రలో కనిపించనున్న కంగనా.. శత్రువుల పని పట్టబోతోందన్నమాట. ఈ చిత్రాన్ని రజనీష్ రాజీ ఘాయ్ రూపొందిస్తుండగా.. దీపక్ ముకుత్, సోహైల్ మక్లాయ్ నిర్మిస్తున్నారు. ‘దాకడ్’ చిత్రాన్ని అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

వారసత్వ హీరోయిన్లు చేసిన పాత్రలకు పోటీగా అలాంటి క్యారెక్టర్లతోనే సినిమాలు చేయడం కంగనాకు అలవాటు. ఆమె ఎప్పుడూ టార్గెట్ చేసే ఆలియా భట్ ‘రాజీ’లో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగానే ‘దాకడ్’ చేస్తున్నట్లు కనిపిస్తోంది. జాన్వి కపూర్ ‘గుంజన్ సక్సేనా’ సినిమా తరహాలోనే ఆమె ‘తేజస్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.