క్రాక్‌ను దెబ్బ కొట్టినోళ్లే మందు రాస్తారట‌

సంక్రాంతి కానుక‌గా విడుద‌లై విజ‌య‌వంతంగా న‌డుస్తున్న క్రాక్ సినిమాకు విడుద‌ల విష‌యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిందే. జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం.. నిర్మాత‌కు చెన్నై ఫైనాన్షియ‌ర్ల‌తో ఉన్న ఇబ్బందుల కార‌ణంగా ఒక రోజు ఆల‌స్యంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 9న ఉద‌యం మొద‌లైన ర‌గ‌డ రాత్రి వ‌ర‌కు కొన‌సాగింది. ఎప్పుడో సెకండ్ షోల స‌మ‌యానికి కానీ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు.

అప్ప‌టిక‌ప్పుడు టెంప‌ర్ రీమేక్ అయోగ్య చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసే విష‌యంలో నెల‌కొన్న వివాదం విష‌య‌మై ప‌ది కోట్లు అప్ప‌టిక‌ప్పుడు సెటిల్ చేస్తే త‌ప్ప సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మం కాలేదు. ఈ విష‌యంలో నిర్మాత ఠాగూర్ మ‌ధు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఆయ‌న్ని కోలీవుడ్ జనాలు ముప్పు తిప్ప‌లే పెట్టారు.

శ‌నివారం అంటే బాక్సాఫీస్‌కు బాగా క‌లిసొచ్చే రోజు. ఆ రోజు పూర్తి రెవెన్యూ కోల్పోయిన క్రాక్‌.. త‌ర్వాత సంక్రాంతి సినిమాల పోటీని త‌ట్టుకుని ఏమేర నిల‌బ‌డుతుందో అనుకున్నారు. కానీ ఆ సినిమాలే ఇప్పుడు క్రాక్ పోటీని త‌ట్టుకోలేక‌పోతున్నాయి. ఇప్ప‌టికే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల బాట ప‌ట్టింది క్రాక్. కొన్ని ఏరియాల‌ను సొంతంగా రిలీజ్ చేసుకున్న ఠాగూర్ మ‌ధు మంచి ఆదాయ‌మే అందుకోనున్నాడు.

అలాగే ఇప్పుడు క్రాక్ రీమేక్ హ‌క్కుల కోసం గ‌ట్టి డిమాండ్ ఏర్ప‌డ‌టంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేవు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన చోటి నుంచే డిమాండ్ ఎక్కువ‌గా ఉంది. త‌మిళ రీమేక్ కోసం అక్క‌డి నుంచి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. క్రాక్ రిలీజ్ కోసం అత్య‌వ‌స‌రంగా సెటిల్ చేసిన డ‌బ్బులకు మించి ఆయ‌న లాభాలు అందుకోబోతున్నారు. అలాగే హిందీ రీమేక్ కోసం కూడా ఆఫ‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి క్రాక్ మూవీతో ఠాగూర్ మ‌ధు క‌ష్టాల‌న్నీ తీరిపోయేట్లే ఉన్నాయి.