కొన్ని సినిమాల ఫెయిల్యూర్లు కొందరు కెరీర్ల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తుంటాయి. ఒక మూవీలో చాలామంది భాగం అయినా.. కొందరి మీదే ఎక్కువ ప్రభావం ఉంటుంది. తన కెరీర్లో ‘కింగ్ ఆఫ్ కోథా’ సినిమా డిజాస్టర్ కావడం తనను చాలా ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టినట్లు కథానాయిక ఐశ్వర్య లక్ష్మి చెప్పింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ మలయాళ చిత్రం 2023లో భారీ అంచనాల మధ్య రిలీజైంది.
దుల్కర్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ (రూ.50 కోట్లు), భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఇది. కానీ బ్యాడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తాను విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నానని.. మానసికంగా కూడా తనను దెబ్బ తీసే స్థాయికి అది చేరుకుందని ఐశ్వర్య చెప్పింది. ఒక దశలో దుల్కర్‌తో మళ్లీ కలిసి పని చేసే అవకాశం వచ్చినా, ట్రోలింగ్‌కు భయపడి ఆ ఛాన్స్ వదులుకున్నట్లు ఆమె తెలిపింది.
‘‘కింగ్ ఆఫ్ కోథా తర్వాత నాకు అవకాశాలు ఇవ్వడానికి మలయాళ పరిశ్రమ భయపడినట్లు అనిపించింది. ఈ సినిమాలో భాగమైన అందరినీ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. నా నటన, డైలాగ్ డెలివరీ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. కొన్నిసార్లు నాక్కూడా ఆ విమర్శలు నిజమేనా అనిపించేది. నేను అందులో హీరోను రాజువెట్టా అని పిలుస్తాను. నన్ను ట్రోల్ చేయడానికి ఆ మాటనే వాడేవారు.
చివరికి ఇండస్ట్రీలో జనాలు కూడా ఆ మాట వాడి నన్ను ఎగతాళి చేశారు. ఒక సినిమా షూటింగ్ టైంలో సెట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఆ మాటతో ఏడిపించే ప్రయత్నం చేశాడు. చాలా బాధ పడ్డాను. తర్వాత దుల్కర్‌తో ఒక యాడ్ చేసే అవకాశం వచ్చింది. కానీ నాతో అతను కలిసి నటిస్తే మళ్లీ ట్రోల్ చేస్తారనే భయంతో ఆ ఛాన్స్ వదులుకున్నా. దుల్కర్‌కు కూడా ఇదే మాట చెప్పా. కింగ్ ఆఫ్ కోథా ట్రోల్స్ నన్ను ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టాయి’’ అని ఐశ్వర్య చెప్పింది. ఐశ్వర్య ప్రస్తుతం తెలుగులో సాయిధరమ్ తేజ్ సరసన ‘సంబరాల యేటి గట్టు’ చిత్రంలో నటిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates