వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ వరుస ఫెయిల్యూర్లతో రవితేజ కోల్పోయిన మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తాన్ని భర్తీ చేసే స్థాయిలో ‘ఇరుముడి’ అసాధారణ ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రవితేజ ఎవ్వరూ ఊహించని రికార్డులను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఫుట్ ఫాల్స్, బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు, రోజు వారీ షేర్ల విషయంలో పెద్ద పెద్ద సినిమాల ఘనతలను కూడా మ్యాచ్ చేస్తూ సాగిపోతోందీ సినిమా.
ఈ చిత్రంలో రవితేజ మరో అరుదైన జాబితాలో చేరాడు. ఒకేసారి వంద కోట్ల గ్రాస్, వంద కోట్ల షేర్ మార్కును అందుకున్న అతి కొద్ది మంది హీరోల్లో ఒకడిగా నిలిచాడు మాస్ రాజా. ‘ధమాకా’తోనే రవితేజ వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నట్లుగా ఆ చిత్ర బృందం ప్రకటించుకుంది కానీ.. వాస్తవంగా ఆ సినిమా ఆ మార్కును అందుకోలేదు.
‘ఇరుముడి’తోనే రవితేజ ఒరిజినల్‌గా ఆ రికార్డును అందుకున్నాడు. ఐతే ఈ చిత్రం అంతటితో ఆగిపోలేదు. వంద కోట్ల షేర్ కూడా సాధించింది. ఆల్రెడీ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసిన ‘ఇరుముడి’ ఇప్పుడు రూ.250 కోట్ల క్లబ్బు మీద గురి పెట్టింది. తెలుగులో ఒక సినిమాతో ఒకేసారి వంద కోట్ల గ్రాస్, షేర్ మార్కును అందుకున్న హీరోలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వాళ్లే ప్రభాస్, చిరంజీవి, తేజ సజ్జ.
‘బాహుబలి: ది బిగినింగ్’తో ప్రభాస్ ముందుగా ఈ క్లబ్బులోకి అడుగుపెట్టాడు. తర్వాత చిరు తన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో ఈ ఘనతను అందుకున్నాడు. తేజ సజ్జను ‘హనుమాన్’ ఆ క్లబ్బులోకి తీసుకెళ్లింది. ఇప్పుడు రవితేజ ఈ జాబితాలో చేరాడు. ఈ సినిమా మూడో వీకెండ్లో కూడా కొత్త సినిమాలా వసూళ్ల మోత మోగిస్తోంది. శనివారం హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయిన ‘ఇరుముడి’కి ఆదివారం కూడా అలాంటి రెస్సాన్సే వస్తోంది. ‘ది ప్యారడైజ్’ అనుకున్న డేటుకు రాకపోతే ఈ నెలంతా ‘ఇరుముడి’ జోరు కొనసాగేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates