ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలలో కూటమి విజయ దుందుభి మోగించింది. ఈ ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లోనూ 96.87% స్ట్రైక్ రేట్ నమోదు చేసిన కూటమి అభ్యర్ధులు.. ఊహించని విధంగా గెలుపు గుర్రం ఎక్కారు. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారి… నందివాడ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు సొంతం చేసుకోవడం మరో విశేషం. గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 32 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో పోరు హోరా హోరీగానే సాగింది. ముఖ్యంగా వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నానీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన ఆధ్వర్యంలోనే నేతలను కూడా ఎంపిక చేశారు.
అయినప్పటికీ గుడివాడ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కూటమికే జై కొట్టారు. మొత్తం 32 ఎంపీటీసీల్లో 31 స్థానాల్లో కూటమి విజయం దక్కించుకుంది. ఆది నుంచి కూడా టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. కూటమి అభ్యర్థుల కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో కూటమి గుడివాడలో పాగా వేసేలా చేయగలిగారు. ముఖ్యంగా నందివాడ మండలంలో టీడీపీ చరిత్రలో తొలిసారిగా జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. పార్టీ ఆవిర్భావం అనంతరం ఈ రెండు కీలక పదవులను తొలిసారి దక్కించు కోవడంతో ఇక్కడ గతం నుంచి ఉన్న కొడాలి నాని హవాకు బ్రేకులు పడ్డాయి.
వాస్తవానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని పరాజయం పెద్ద మైనస్ అయింది. అప్పట్లో ఆయన సానుభూతి ఓట్లు రాబట్టేందుకు.. ఇదే చివరి ఎన్నిక అని కూడా చెప్పారు. అయినా.. గుడివాడ ప్రజలు కూటమి అభ్యర్థికే మొగ్గు చూపారు. ఇక, ఆ తర్వాత.. రెండున్నరేళ్లకు వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొడాలికి తీవ్ర పరాభవం ఎదురైంది. ఎన్నికలు జరిగిన గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 32 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు గాను 31 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
గుడివాడ రూరల్ మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి అంగడాల భారతి 2,173 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇదే మండలం పరిధిలోని 6 ఎంపీటీసీ స్థానాలకు 5 చోట్ల టీడీపీ గెలిచింది. అలానే, నందివాడ మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి దుడ్ల రాజ్ ప్రదీప్ కుమార్ 2,431 ఓట్ల భారీ మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. 8 ఎంపీటీసీలలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. గుడ్లవల్లేరు మండలంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణ 7,650 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇలా.. కీలకమైన గుడివాడ మొత్తం కూటమి కుమ్మేయగా.. కొడాలికి కూసాలు కదిలిపోయాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates