సినిమాపై ధీమానా… ప్ర‌భాస్ రాడ‌న్న ధైర్య‌మా?

ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. దానికి పోటీగా వేరే సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఎవ్వ‌రైనా కంగారు ప‌డ‌తారు. సంక్రాంతి లాంటి పండుగ సీజ‌న్లు మాత్ర‌మే ఇందుకు మిన‌హాయింపు. మామూలు రోజుల్లో అయితే ప్ర‌భాస్ సినిమాకు వీకెండ్‌ను రాసిచ్చేస్తారు. అందులోనూ ప్ర‌భాస్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ఫౌజి మీద ఏ స్థాయిలో అంచ‌నాలున్నాయో తెలిసిందే.

ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 3న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు టీం ప్ర‌క‌టించింది. ఆ ప్ర‌కార‌మే షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ప్లాన్ చేసుకుని అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికైతే ఫౌజి వాయిదా వేయ‌బోతున్న సంకేతాలేమీ టీం నుంచి రాలేదు. అయినా ఆ సినిమాకు పోటీగా ఓ మిడ్ రేంజ్ సినిమాను తీసుకురావ‌డానికి రెడీ అయిపోయారు. ఆ చిత్ర‌మే.. లెగ‌సీ.

యంగ్ హీరో విశ్వ‌క్సేన్ హీరోగా న‌టిస్తున్న మూవీ.. లెగ‌సీ. ఇంత‌కుముందు పిండం అనే సినిమా తీసిన సాయికిర‌ణ్ రెడ్డి దైదా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ న‌టుడు కేకే మీన‌న్ ఇందులో ఓ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఇందులో ఏక్తా రాథోడ్ విశ్వ‌క్‌కు జోడీగా న‌టించింది. ఈ మూవీని డిసెంబ‌రు 4న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఈ రోజు ప్ర‌క‌టించారు. హీరో హీరోయిన్లు గుర్రాల‌పై ప్ర‌యాణిస్తూ ముద్దాడుకుంటున్న పోస్ట‌ర్‌తో టీం రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. లెగ‌సీ..

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని మ‌ద‌న‌ప‌ల్లి కేంద్రంగా న‌డిచే పొలిటిక‌ల్ డ్రామా. ఈ సినిమాను అనౌన్స్ చేసిన‌పుడు రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షించింది. ఇందులో రావు రమేష్‌, ముర‌ళీ మోహ‌న్, స‌చిన్ ఖేద్క‌ర్ లాంటి పెద్ద పెద్ద న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. య‌శ్వంత్ ద‌గ్గుబాటి అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మ‌రి త‌మ సినిమా మీద చాలా న‌మ్మ‌కం ఉండి ఫౌజికి పోటీగా దించాల‌ని ఫిక్స‌య్యారా.. లేక ప్ర‌భాస్ సినిమా చెప్పిన డేటుకు రాద‌న్న ధైర్యంతో లెగ‌సీని డిసెంబ‌రు 4న రిలీజ్ చేస్తున్నారా అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.