దేశంలో మిగతా ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నా.. తెలంగాణ, ఏపీల్లో సినిమా టికెట్ల ధరలు తక్కువగా ఏమీ లేవు. కానీ మరెక్కడా లేని విధంగా కొన్ని చిత్రాలకు ఆ రేట్ల మీద అదనపు ధరలు వడ్డించడం మీద ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని దోపిడీగా భావిస్తున్నారు. పెంచిన ధరలకు తగ్గట్లు గొప్ప అనుభవాన్ని ఇచ్చే సినిమాలు కూడా అరుదుగానే వస్తున్నాయి. దీంతో వాళ్లు తిట్టుకుంటూనే టికెట్లు కొంటున్నారు. కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోతే తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.
ఇటీవల డబ్బింగ్ సినిమా టాక్సిక్‌కు కూడా రేట్లు పెంచితే.. ప్రేక్షకుల నుంచి ఏ స్థాయిలో ఆక్రోశం వ్యక్తమైందో తెలిసిందే. అదే సమయంలో నార్మల్ రేట్లతో రిలీజైన ఇరుముడి సినిమాకు ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పట్టారో తెలిసిందే. గత రెండు మూడు నెలల్లో మరిన్ని చిత్రాలకు ఇలాగే మంచి ఆదరణ దక్కింది. ఇది రేట్ల పెంపు విషయంలో నిర్మాతలను పునరాలోచింపజేస్తుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇరుముడి నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేనిని ఈ చిత్ర సక్సెస్ ప్రెస్ మీట్లో టికెట్ల రేట్ల పెంపు విషయమై ప్రశ్నించగా.. ఆయన ఆచితూచి బదులిచ్చారు. ఏడాదిలో ఐదారు సినిమాలకు మాత్రమే రేట్ల పెంపు ఉంటుందన్నారు. ఒక హీరో లేదా దర్శకుడి మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టినపుడు, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కువ ఖర్చుపెట్టినపుడు రేట్ల పెంపులో తప్పులేదని ఆయనన్నారు. ఇప్పుడు తెలుగు సినిమా 400-500 కోట్ల బడ్జెట్లలో సినిమాలు తీస్తోందన్నారు.
వారణాసి, రాకా, డ్రాగన్, ఫౌజీ లాంటి చిత్రాలు ఇండియాను దాటి ప్రపంచ స్థాయికి భారతీయ సినిమాను తీసుకెళ్లబోతున్నాయని.. ఇలాంటి సినిమాలకు కొంచెం రేట్లు పెంచితేనే వర్కవుట్ అవుతుందని.. అలాంటి సినిమాలను ఎక్కువ రేటు పెట్టి చూడడంతో ప్రేక్షకులకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొన్ని నెలల్లో మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి.. ఇలా చాలా సినిమాలను నార్మల్ రేట్లతోనే రిలీజ్ చేశారని, అవి మంచి స్పందన తెచ్చుకున్నాయని ఆయన అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates