రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించింది. దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి టాప్ బాలీవుడ్ హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టేసి ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ స్టోరీని ప్రచురించింది. కానీ ఈ స్థాయిలో ఉన్న రష్మిక కొన్ని వారాలుగా సినిమాలకు దూరమై ఇంటి పట్టునే ఉంటోంది.
‘మైసా’ సినిమా కోసం డ్యాన్స్ చేస్తూ అదుపు తప్పడంతో ఆమెకు కొంచెం పెద్ద గాయమే అయింది. దీంతో కొన్ని నెలలు షూటింగ్స్‌కు దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఇంటిపట్టునే ఉంటోంది రష్మిక. ఐతే ఈ గాయం తనకు వరంలా అనిపిస్తోందని ఆమె అంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండను పెళ్లాడాక తమ ఇద్దరికీ కలిసి గడిపే అవకాశమే రాలేదని.. గాయం పుణ్యమా అని తామిద్దరం ఒకరినొకరు రోజూ చూసుకుంటూ ప్రేమగా గడిపే ఛాన్స్ వచ్చిందని ఆమె అంటోంది.
‘‘పెళ్లయ్యాక సినిమా కమిట్మెంట్ల వల్ల మేమిద్దరం మూడు నెలల పాటు ఒకరినొకరు చూసుకోలేదు. కేవలం ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్లం. అలాంటి టైంలో మా ఇద్దరికీ కొంచెం బ్రేక్ ఇద్దామని, ఈ విశ్వమే గాయం అయ్యేలా ప్లాన్ చేసిందేమో అనిపిస్తుంది. పెళ్లయ్యాక మేమిద్దరం కలిసి ఎక్కువ సమయం గడపడం ఇప్పుడే. ఇది వినడానికి వింతగా అనిపించినా.. నిజం. ఈ టైం నాకు చాలా నచ్చింది.
ఇద్దరం కలిసి ఇంట్లో చాలా సంతోషంగా గడిపాం. టీవీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూశాం. విజయ్‌కి ఎక్కువగా సీరియస్ డ్రామాలు, షోలు ఇష్టం. నాకేమో కొరియన్ డ్రామాలు అంటే పిచ్చి. ఇద్దరం ఆ రెండూ చూశాం. ఈ గ్యాప్‌లో విజయ్‌కి కొరియన్ డ్రామాలు అలవాటు చేశా’’ అని రష్మిక చెప్పింది. ఇక ముందు కూడా తామిద్దరం ఇలాగే ఎక్కువ రోజులు గడపాలని విజయ్ అన్నాడని.. కానీ గాయాల పాలవకుండా అని కండిషన్ పెట్టాడని రష్మిక నవ్వేసింది. ఈ రెస్ట్ టైం తన జీవితంలో మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆమె అంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates