కాకా ఇంత పట్టుదలగా ఎందుకు ఉన్నాడు

చిరంజీవి కాకా స్పీడ్ మాములుగా లేదు. నిన్న జరిగిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్వయంగా కొన్ని అప్డేట్స్ ఇచ్చేశారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. తమన్ రీ రికార్డింగ్ మొదలుపెట్టేశారు. సెకండాఫ్ లో 30 శాతం ఆల్రెడీ పూర్తి చేశారు. అంటే ఏ రేంజ్ లో దర్శకుడు బాబీ కొల్లి పరుగులు పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు జనవరి సంక్రాంతి పండగ సందర్భంగా కాకా విడుదలవుతుందని తమన్ ని పక్కన పెట్టుకుని మరీ చిరు కన్ఫర్మేషన్ ఇవ్వడం అసలు ట్విస్టు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికే రెండేళ్లకు పైగా ల్యాబ్ లో మగ్గుతున్న విశ్వంభర కూడా సంక్రాంతి కోసమే విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. యువి సంస్థ మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా రామ్ చరణ్ కు ఎంతో క్లోజ్ అయినప్పటికీ కాకాని డేట్ మార్చుకోమని ఒప్పించే క్రమంలో సక్సెస్ కాలేకపోయింది. ఇంత పట్టుదలగా ఉండటం వెనుక పలు కారణాలు అర్థం చేసుకోవచ్చు. విశ్వంభర ఆలస్యం చిరంజీవి వల్ల కాలేదు. విఎఫెక్స్ జాప్యం వల్ల నెలలు ఏళ్ళు గడిచిపోయాయి.

2024 చిరు పుట్టినరోజుకు టీజర్ వదిలిన టైంలో నెగటివిటీ వచ్చింది. నిజమే. కానీ త్వరగా మేల్కొని క్వాలిటీ పెరిగేలా వేగంగా పనులు చేయించి ఉంటే సరిపోయేది. ఏదో అవతార్ రేంజ్ లో ఇంత సమయం ఖర్చు పెట్టడం ప్రాజెక్టు మీద బజ్ తగ్గే రిస్క్ తీసుకొచ్చింది. ఇది నిర్మాతల వల్ల జరిగిందా లేదా దర్శకుడి వల్లా అనేది పక్కనపెడితే భాద్యులు మాత్రం వాళ్లిద్దరే. టైం మీరిపోవడంతో కీరవాణి పక్కకు తప్పుకోవడం, ఆ స్థానంలో గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయడం తెలిసిన విషయమే.

ఎలా చూసుకున్నా కాకా ఒక ప్లాన్ ప్రకారం పద్దతి ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. సంక్రాంతి టార్గెట్ పెట్టుకునే షూటింగ్ చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్న విశ్వంభరకు రూట్ ఇవ్వలేమనేది వాళ్ళ వాదనట. చివరికి దీనికి పరిష్కారం ఏది దొరుకుతుందో అర్థం కావడం లేదు. కాకా మొదటి ఆడియో సింగల్ కి రంగం సిద్ధమవుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓజి ఇచ్చినట్టు ఈసారి కాకాతో అన్నయ్యకు మ్యూజికల్ ఫీస్ట్ పక్కా అని తమన్ హామీ ఇస్తున్నాడు.