బాయ్‌కాట్ అనగానే మానేస్తారా?

సోషల్ మీడియాలో సినిమా ఫ్యాన్స్ ఎప్పుడు ఎందుకు హర్ట్ అవుతారో అర్థం కాదు. విచిత్రమైన కారణాలతో బాయ్‌కాట్ పిలుపులు ఇస్తుంటారు. ఎప్పుడో పాత విషయాలను కూడా బయటికి తీసి.. కొత్త సినిమాలను ‘బాయ్‌కాట్’ పేరుతో బెదిరించడం ఇప్పుడొక ఫ్యాషన్ అయిపోయింది. బాలీవుడ్లో ఒక టైంలో ఇదొక ప్రహసనంలా తయారైంది. ‘లాల్ సింగ్ చడ్డా’ సహా కొన్ని చిత్రాలను ఇలాగే దెబ్బ కొట్టారు. కానీ తర్వాత ఈ ‘బాయ్ కాట్’ మంత్రం అంతగా పని చేయట్లేదు. అయినా ట్రై చేసే వాళ్లు చేస్తూనే ఉన్నారు.

ఇటీవల ‘ఇరుముడి’ సినిమా నుంచి ‘టాక్సిక్’కు స్క్రీన్లు తీసేసుకుంటున్నారని.. ‘టాక్సిక్’ సినిమాను తెలుగు వాళ్లు టార్గెట్ చేశారు. ‘‘సేవ్ ఇరుముడి’’, ‘‘బాయ్‌కాట్ టాక్సిక్’’ అంటూ హ్యాష్ ట్యాగ్‌లు రన్ చేశారు. అయినా ‘టాక్సిక్’ మీద తొలి రోజు ఆ ప్రభావం ఎంతమాత్రం పడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి. ఆ చిత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఐతే సినిమా బాలేకపోవడం వల్ల, మరీ బ్యాడ్ టాక్ రావడం వల్ల రెండో రోజు నుంచి డౌన్ అయింది తప్ప.. బాయ్‌కాట్ పిలుపులేమీ పని చేయలేదు.

ఐతే కన్నడిగులు మాత్రం ‘బాయ్‌కాట్ టాక్సిక్’ హ్యాష్ ట్యాగ్‌‌ను సీరియస్‌గా తీసుకున్నారు. ‘టాక్సిక్’ సినిమా నచ్చలేదన్నందుకు, దాన్ని ట్రోల్ చేసినందుకు తెలుగు వాళ్లను, తెలుగు సినిమాలను టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా హేట్ క్యాంపైన్ నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో ‘ఇరుముడి’ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. కానీ వాళ్ల పిలుపు ఏమాత్రం పని చేయలేదు. మొదట్నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటకలోనూ బాగా ఆడుతున్న ‘ఇరుముడి’ రెండో వీకెండ్లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

‘టాక్సిక్’ రిలీజ్ రోజు కొంచెం తగ్గిన వసూళ్లు వీకెండ్లో మరింత పుంజుకున్నాయి. బాయ్‌కాట్ పిలుపు ఇచ్చాక ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకా పెరగడం విశేషం. దీన్ని బట్టి ఈ అప్పీల్స్ జనాలను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయన్నది స్పష్టం. ఎప్పుడో అల్లు అరవింద్.. యశ్‌ను తక్కువ చేసి మాట్లాడాడంటూ, ఇకపై ఏ తెలుగు సినిమాను కర్ణాటకలో ఆడనివ్వమనడం.. అలాగే అల్లు అర్జున్ ‘రాకా’ను బాయ్‌కాట్ చేస్తామని ఇప్పుడే హెచ్చరించడం కూడా గమనించవచ్చు. కానీ ఇలాంటి పిలుపుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఎప్పటికప్పుడు రుజువవుతున్నా.. వీళ్లు మాత్రం ఆగట్లేదు.