‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్కి మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ‘రెడ్’ సినిమా టీజర్లు, ట్రెయిలర్లు చూసి ఇందులోను మాస్ బాగా దట్టించారని ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే తమిళ కథను పూర్తిగా మార్చకూడదు కనుక రామ్ని పూర్తిస్థాయి మాస్ హీరోగా చూపించలేకపోయారు. దీంతో పెదవి విరుపులు వస్తున్నాయి. రెడ్ నిరాశ పరిచిందనే టాక్ బాగానే వినిపిస్తోంది. అయితే సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు కలక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయి.
ఒక వైపు క్రాక్ అంత బాగా ఆడుతున్నా, మాస్టర్, అల్లుడు అదుర్స్తో పోటీ గట్టిగా వున్నా కానీ రామ్ తన సత్తా చాటుకున్నాడు. ఇదే కనుక రెడ్ ప్లేస్లో రామ్ రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ చేసినా రిజల్ట్ మరోలా వుండేది. వరుస విజయాలు సాధించలేకపోతున్నాడనే పేరు కూడా పోయేది. హిట్టిచ్చిన ప్రతిసారీ వెంటనే డిజప్పాయింట్ చేయడం వలనే రామ్ రేంజ్ ఒక స్థాయికే పరిమితమయింది.
అతడిలో పక్కా మాస్ హీరో వున్నాడనేది పూరి జగన్నాథ్ చూపించాడు. అలాంటి పాత్రలిస్తే ఎలా చెలరేగిపోతాడనేది రామ్ నిరూపించుకున్నాడు. అయితే వర్కవుట్ అయ్యే కథలను వరుసగా ఎంచుకోవడంలో వున్న వీక్నెస్ మరోసారి అతడికి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసింది.