ఇరుముడి సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ తలలు పండిన నిర్మాతలను సైతం షాక్ కు గురి చేస్తోంది. పది రోజులకు కూడా ఏ మాత్రం తగ్గని కలెక్షన్ల ఉదృతితో ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి కారణం కథా అంటే వంద శాతం ఔనని చెప్పలేం. ఎందుకంటే ఈ తరహా క్రైమ్ థ్రిల్లర్స్ గతంలో కూడా వచ్చాయి. పోనీ అయ్యప్పస్వామి మాల, ముత్యాల పల్లకి పాట, కూతురి ఎమోషన్ పని చేశాయా అంటే మెజారిటి జనాలు ఔననే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
సరే ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఒక సినిమా పెద్ద విజయం సాధించినప్పుడు అదే ఫార్ములాలో మరికొందరు దర్శకులు కథలు రాసుకోవడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. పెళ్లి సందడి, సమరసింహారెడ్డి, ప్రేమదేశం లాంటివి సృష్టించిన బెంచ్ మార్క్ వల్ల వాటిని ఫాలో అవుతూ ఎన్నో వందల చిత్రాలొచ్చాయి. కొన్ని హిట్టు కొన్ని ఫట్టు అయ్యాయి. అయితే ఇప్పటి జనరేషన్ వేరు. గుడ్డిగా ఒక ఫార్ములా వెనుకబడి దాని మీద సినిమాలు తీసుకుంటూ పోతే జాక్ పాట్ కొట్టొచ్చు లేదా దెబ్బ పడొచ్చు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా టాలీవుడ్ దర్శకులు కొందరు ఈ మాల కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని సబ్జెక్టులు తయారు చేసే పనిలో ఉన్నారట. అయ్యప్ప తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన దీక్షలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. బెజవాడ దుర్గమ్మ కోసం వేసే భవాని మాల, శ్రీశైలం మల్లన్న కోసం చేసే శివ దీక్ష, అంజనీపుత్రుడి ప్రసన్నం కోసం చేసే హనుమాన్ దీక్ష ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడీ సెంటిమెంట్ క్యాష్ చేసుకోవడానికి రచయితలు సిద్ధమయ్యారట.
ఇలాంటి పోకడ మనకు కొత్త కాదు. గ్రామాల్లో దేవతలు, దెయ్యాలు ఆధారంగా ఓ రెండు సినిమాలు హిట్టయ్యాక అదే జానర్ లో చాలా వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. మా ఊరి పొలిమేర, క, విరూపాక్ష, ఊరిపేరు భైరవకోన, కిష్కిందపురం మొదలైనవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు ఇరుముడి పుణ్యమాని దేవుడి మాలని ఒక ఫార్ములాగా మార్చుకుని అదే దారిలో ఇతరులు వచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఎవరు ముందుగా ఈ అవకాశాన్ని వాడుకుని తెర మీదకు వస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
