ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా కావడంతో స్క్రీన్స్, షోలు కూడా అటువైపు వెళ్లాయి. పైగా ‘ఇరుముడి’ అప్పటికే వారం పూర్తి చేసుకుంది. కానీ ఇప్పుడు రెండో వీకెండ్ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి కాస్త మారుతోంది. రవితేజ సినిమా ఇంకా థియేటర్లలో తన ఆడియన్స్‌ను అలానే పట్టుకుంటోంది.

మొదటి వారం ‘ఇరుముడి’కు బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్లే వచ్చాయి. ఆదివారం వరకు పెరిగిన వసూళ్లు, ఆ తర్వాత వీక్ డేస్‌లో కూడా పూర్తిగా పడిపోకుండా వచ్చిన హోల్డ్ సినిమాకు ఉపయోగపడింది. గురువారం వరకు కూడా కలెక్షన్స్ కొనసాగడంతో రెండో వారం కోసం సరిపడా స్క్రీన్స్ దక్కే పరిస్థితి వచ్చింది.

ఇక్కడ ‘టాక్సిక్’ లెక్క కూడా ‘ఇరుముడి’కి కలిసి రావచ్చు. యష్ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్ తీసుకుంది. కానీ రెండో రోజే కలెక్షన్స్‌లో పెద్ద డ్రాప్ కనిపించింది. మొదటి రోజు ఉన్న హడావుడి అదే స్థాయిలో కొనసాగకపోతే వీకెండ్‌లో మిగతా సినిమాలకు కూడా మళ్లీ కొంత స్పేస్ దొరుకుతుంది. ‘ఇరుముడి’కి ఇప్పుడు కావాల్సింది కూడా అదే.

పైగా ఈ రెండు సినిమాల ఆడియన్స్ కూడా పూర్తిగా ఒకటే కాదు. ‘టాక్సిక్’కు A సర్టిఫికెట్ ఉంది. దాని కంటెంట్ కూడా అడల్ట్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తయారైంది. టాక్ కూడా అంతగా పాజిటివ్ లేదు. ‘ఇరుముడి’ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్, అయ్యప్ప నేపథ్యంతో వచ్చింది. అందుకే కుటుంబంతో సినిమా చూడాలనుకునే వాళ్లకు పెద్ద రిలీజ్ వచ్చినా ‘ఇరుముడి’ ఇంకా ఒక ఆప్షన్‌గా ఉండగలుగుతోంది.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు ‘ఇరుముడి’ మళ్లీ జంప్ తీసుకుంటే మూడో వారం వరకు మంచి సంఖ్యలో థియేటర్లు కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. ‘టాక్సిక్’లాంటి పెద్ద సినిమా మధ్యలో వచ్చినా పూర్తిగా సైడ్ కాకుండా నిలబడటం మామూలు విషయం కాదు. ఇక ఫైనల్ నెంబర్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.