మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు రేట్లు వడ్డిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఓ మోస్తరు సినిమాలకు కూడా మల్టీప్లెక్సుల్లో రూ.295 రేటు ఉంటోంది. అదనపు రేట్లు వడ్డిస్తే ఇంకా ఎక్కువ ధర పెట్టి సినిమా చూడాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ టికెట్ల ధరలు కొంచెం రీజనబుల్‌గా ఉంటున్నాయి.
ఐతే అన్ని సింగిల్ స్క్రీన్ల మెయింటైనెన్స్ అంత బాగుండదు కాబట్టి.. ఉన్నంతలో మెరుగ్గా ఉన్నవి, రెనొవేట్ చేసిన- ప్రొజెక్షన్ బాగున్న వాటిని ఎంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాటిలో కూడా టికెట్ల ధరలు పెరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోను బట్టి చూస్తే సింగిల్ స్క్రీన్లలోనూ మల్టీప్లెక్సులతో సమానంగా టికెట్ల ధరలు ప్రియం కాబోతున్నాయన్నది స్పష్టం.
ఏసీ ఉన్న నార్మల్ సింగిల్ స్కీన్లలో టికెట్ ధర ప్రస్తుతం 150 ఉండగా ఇప్పుడు గరిష్ట రేటు రూ.200 పెట్టుకునే అవకాశం కల్పించింది కొత్త జీవో. అంటే రేటు రూ.50 పెరగబోతోందన్నమాట. మరోవైపు 7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్, 2కే-4కే ప్రొజెక్షన్ ఉన్న స్పెషల్ సింగిల్ థియేటర్లలో గరిష్ట టికెట్ ధర రూ.250 పెట్టుకునే సౌలభ్యం కల్పించారు. ప్రస్తుతం ఆ థియేటర్లలో గరిష్ట టికెట్ ధర రూ.175 ఉంది.
అంటే ఒకేసారి రూ.75 దాకా రేటు పెంచే అవకాశముంది. ప్రభుత్వం జీవో ఇచ్చిందంటే ఇక రేట్ల పెంపు విషయంలో సింగిల్ స్క్రీన్ల యజమానులు ఎందుకు ఆగుతారు? కాబట్టి ప్రేక్షకులపై భారం తప్పదన్నమాట. ఈ రేట్ల మీద ఇక పెద్ద సినిమాలకు అదనపు రేట్లు వడ్డించారంటే అంతే సంగతులు. టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే జనం ఎంత బాగా థియేటర్లకు వస్తారో ఇటీవల కొన్ని సినిమాలు రుజువు చేశాయి. ఈ ట్రెండు చూసి అందరూ సంతోషిస్తున్న సమయంలో ఈ కొత్త టికెట్ల రేట్ల జీవో ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు దూరం చేసేలా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates