అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది. మాస్ రాజా రవితేజను అయ్యప్ప భక్తుడిగా చూపిస్తూ ‘ఇరుముడి’ అనే సినిమా తీసిన మేకర్స్.. ఈ సినిమాలోనూ ‘మల్లెపూల పల్లకి’ పెడుతున్నారన్న వార్త బయటికి రావడంతో ఈ సాంగ్‌కు ముందే మంచి హైప్ వచ్చింది. పాట ఒక రేంజిలో ఉంటుందని ఊహించుకున్నారు.
కానీ తీరా చూస్తే ఈ పాటను రిలీజ్ చేసినపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఒరిజినల్ సాంగ్‌ను యథాతథంగా కంపోజ్ చేసి ఉన్నా అదిరిపోయేదని.. జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఒరిజినల్ ట్యూన్‌కు సరితూగేలా సాంగ్ కంపోజ్ చేయలేదని, ఒరిజినల్ సింగర్ డప్పు శ్రీనుతోనే ఈ పాట పాడించినా అసలు పాటను మ్యాచ్ చేయలేకపోయారని విమర్శలు వచ్చాయి. సినిమాలో ఈ పాట డీజే వెర్షన్ ఉంటుందని, అది పెద్ద సర్ప్రైజ్ అని మేకర్స్ అంటున్నప్పటికీ.. జనాల్లో అంచనాలు పెరగట్లేదు.
‘మల్లెపూల పల్లకి’ సాంగ్ మీద వస్తున్న విమర్శలపై దర్శకుడు శివ నిర్వాణ తాజాగా స్పందించాడు. ఒరిజినల్ సాంగ్‌లో ఉన్న బేస్ వాయిస్‌కు ‘ఇరుముడి’లో ఉన్న వాయిస్ సరితూగలేదన్న అభిప్రాయాన్ని శివ నిర్వాణ అంగీకరించాడు. అసలు పాటను పాడిన డప్పు శ్రీనుతోనే పాడించినా.. ఈ తేాడా ఎందుకు వచ్చిందో అతను వివరించే ప్రయత్నం చేశాడు.
ఒరిజినల్ సాంగ్‌ను డప్పు శ్రీను 15 ఏళ్ల కిందట పాడాడని.. ఇప్పుడు ఆయన వయసు పెరిగిందని, స్వరం మారిందని.. అందుకే ఒకప్పట్లా బేస్ వాయిస్ లేకపోవచ్చని అతనన్నాడు. ఒరిజినల్ సింగర్‌తో పాడించి గౌరవించాలన్న ఉద్దేశంతోనే డప్పు శ్రీనుతో ఈ పాట పాడించామని శివ తెలిపాడు.
మరోవైపు అయ్యప్పస్వామి మాల నేపథ్యంలోనే సాగే మలయాళ చిత్రం ‘మాలికాపురం’తో ‘ఇరుముడి’కి వస్తున్న పోలికల గురించి కూడా శివ నిర్వాణ స్పందించాడు. రెంటినీ పోల్చడంలో ఆశ్చర్యం లేదని.. కానీ తన సినిమాలో ఏం కంటెంట్ ఉందో తనకు తెలుసు కాబట్టి తాను ఎప్పడూ ఈ పోలికల గురించి కంగారుపడలేదని… తన సినిమా యునీక్‌గా ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారని అతను ధీమా వ్యక్తం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates