లేడీ డైరక్టర్ కు హ్యాండిచ్చి ఆ ఇద్దరికి ఓకె చెప్పాడా?

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు కమిట్ అవుతూ దూసుకుపోతున్నాడు నాగచైతన్య. గత ఏడాది ‘మజిలీ’, ‘వెంకీ మామ’ సినిమాలతో రెండు హిట్లు కొట్టిన చైతూ, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ ముగించుకుని థియేటర్లలోకి రానుంది. దాంతో తర్వాతి సినిమాలను కూడా లైన్‌లో పెడుతున్నాడీ యంగ్ స్టార్.

శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ తర్వాత ఇద్దరు క్రియేటివ్ దర్శకులతో చైతన్య సినిమాలకు కమిట్ అయ్యినట్టు టాక్ వినిపిస్తోంది. ఇంద్రగంటి మోహన కృష్ణతో ఓ మూవీ చేస్తుండగా… క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్‌లో మరో మూవీ చేయబోతున్నాడు చై.

ఇంతకుముందు ‘సవ్యసాచి’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాల షూటింగ్‌లను ఒకేసారి కానిచ్చిన చైతూ… ఇప్పుడు ఈ రెండు సినిమాలను కూడా ఒకేసారి లైన్‌లో పెట్టనున్నాడట. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె. కుమార్ రూపొందించే చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

అయితే నిజానికి ‘లవ్ స్టోరీ’ తర్వాత లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చై మూవీ చేయాల్సింది. సమంత ‘ఓ బేబీ’ తర్వాత గ్యాప్ తీసుకున్న నందినిరెడ్డి, నాగచైతన్య మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశారని, స్వప్న సినిమా బ్యానర్‌లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక నటిస్తుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే సడెన్‌గా లేడీ డైరెక్టర్ మూవీని పక్కనబెట్టి, ఇద్దరు దర్శకులతో మూవీస్ కమిట్ అయ్యాడు నాగచైతన్య.

సక్సెస్ దక్కుతున్నా, స్టార్‌డమ్‌కి దూరంగా ఉంటున్న చైతన్య… ఆ దిశగా అడుగులు వేస్తున్నాడట. అందుకే సాఫ్ట్ స్టోరీస్ డీల్ చేసే నందినిరెడ్డి కంటే విభిన్నమైన కథలతో చిత్రాలు రూపొందించే ఇంద్రగంటి, విక్రమ్ కుమార్ సినిమాలను ముందుగా లైన్‌లో పెట్టినట్టు టాక్.