లక్కీ భాస్కర్ 2 వస్తాడు… కానీ ఒక షరతు  

రెండేళ్ల క్రితం వచ్చిన లక్కీ భాస్కర్ ఓ మోస్తరు అంచనాలతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది. అందుకే ఆకాశంలో ఒక తార, శ్రీశ్రీ అంటూ రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. అయితే లక్కీ భాస్కర్ కొనసాగింపు కావాలని అభిమానులు, సినీ ప్రియులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అసలు ఉంటుందో లేదోననే అనుమానం వాళ్లలో లేకపోలేదు. దానికి దర్శకుడు వెంకీ అట్లూరి చెక్ పెట్టారు.

భాస్కర్ మనీ క్రైమ్స్ కి సీక్వెల్ ఉంటుందని కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత చేస్తానని ప్రకటించారు. ఆ లోగా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ తీసే ప్లాన్ లో ఉన్నారట. ఆయన ఇస్తున్న క్లూస్ ప్రకారం చూస్తే అది ధనుష్ కాంబోలో ఉండొచ్చని అర్థమవుతోంది. ఆ తర్వాత చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని మర్వెల్ సిరీస్ తరహాలో ఒక భారీ చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వీటికి బడ్జెట్, క్యాస్టింగ్ లాంటివి ఇప్పుడేం అనుకోలేదట. ఫిక్స్ చేశాక అనౌన్స్ చేస్తారు.

లక్కీ భాస్కర్ అంతగా జనాలకు కనెక్ట్ కావడానికి కారణం సింపుల్. కోట్లాది భారతీయుల లాగే ఇతను కూడా మధ్యతరగతి కష్టాలలో నలిగిపోయి, చివరికి బ్యాంక్ ను మోసం చేసే పన్నాగం పన్నుతాడు. ఫలితంగా కోట్లాది రూపాయల సొమ్ము ఖాతాలో పడగానే తండ్రి భార్యా కొడుకుతో కలిసి విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు పార్ట్ 2 అంటే ఫారిన్ లో నేరాలు చేస్తాడా లేక కొంత కాలం అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చి కొత్త స్కామ్ మొదలుపెడతాడానేది చూడాలి.

ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్లలో భాగంగా వెంకీ అట్లూరి ఇవన్నీ పంచుకుంటున్నారు. కెరీర్ లో మొదటిసారి సూర్యతో స్ట్రెయిట్ తమిళ సినిమా చేయడంతో అక్కడి వాళ్ళను మెప్పించాలనే టార్గెట్ బలంగా పెట్టుకున్నారు. ఒకవేళ అందులో సక్సెస్ అయితే టాప్ లీగ్ లోకి వెళ్ళడానికి రూట్ క్లియర్ అవుతుంది. మమిత బైజు హీరోయిన్ గా నటించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాకు జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మంచి అట్రాక్షన్ అవుతుందని టాక్.