సెప్టెంబర్ 11 – ఇంత రష్ అయితే ఎలా

ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్ లేని కాలంలో ప్రేక్షకులకు ప్రధాన వినోద సాధనం సినిమానే కాబట్టి థియేటర్లు నిండుగా కనిపించేవి. ఒక్కోసారి స్టార్ హీరోల డిజాస్టర్లు సైతం రెండు మూడు వారాలు హౌస్ ఫుల్స్ పడేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. క్లాష్ కు దిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరు నష్టపోయే సిచువేషన్ ఉంది. సంక్రాంతికి తప్ప ఇతర సీజన్లలో ఇలా తలపడటం రిస్కుగా మారుతోంది.

అయినా సరే ప్రొడ్యూసర్లు తమ పద్ధతి మార్చుకునేలా లేరు. సెప్టెంబర్ 11 దానికి వేదిక కానుంది. తొలుత ఈ డేట్ కి విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా మూవీ, అందులోనూ క్రేజ్ ఉన్న సబ్జెక్టు కావడంతో పోటీకి ఎవరూ సిద్ధ పడలేదు. ఎప్పుడైతే అది తప్పుకుందనే లీక్ వచ్చిందో అక్కడి నుంచి సీన్ మారిపోయింది. సుమంత్ నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ ఆ స్లాట్ ని తీసుకుని అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్ ది ఫస్ట్ సెమిస్టర్’ అదే డేట్ వైపు చూస్తోంది. అన్నయ్య తప్పుకున్నాడు కాబట్టి తమ్ముడు అడ్వాంటేజ్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో ప్లాన్ రెడీ చేస్తున్నారు. రవితేజ ఫ్యామిలీ నుంచి వస్తున్న మాధవ్ భూపతిరాజు పరిచయమవుతున్న ‘మారెమ్మ’ ఆల్రెడీ [ప్రకటించేసుకుంది. రాజమౌళి సమర్పణలో రూపొందుతున్న ఫహద్ ఫాసిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అప్పుడే వచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది.

కార్తీ డబ్బింగ్ మూవీ ‘సర్దార్ 2’ సైతం రేసులో ఉంది. దీనికి తెలుగులో కూడా క్రేజ్ ఉన్న నేపధ్యంలో బిజినెస్ ఆఫర్స్ బాగున్నాయి. సో ఏతావాతా చూసుకుంటే ఇవన్నీ ఒకేసారి ఇలా మూకుమ్మడిగా వస్తే థియేటర్ల సర్దుబాటు ఏమో కానీ ఆడియన్స్ మాత్రం ఏది చూడాలో అర్థం కాక రివ్యూలు,, టాక్స్ మీద ఆధారపడతారు. అయినా వీళ్లంతా ఖచ్చితంగా మాట మీద ఉంటారన్న గ్యారెంటీ లేదు. చివరి నిమిషం దాకా ఎవరెవరు మనసు మార్చుకుని తప్పుకుంటారో ఇప్పుడే చెప్పలేం.