రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు. ఎలా వచ్చినా సరే.. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిపోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, బాగా డబ్బులు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. ఐతే ఒకప్పుడు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగి, ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్.. జస్ట్ ఒక కారు కొనుక్కుంటే చాలు అనే టార్గెట్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టిందట.

తనకు అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందని.. ఆ ఒక్క సినిమా చేసి, దాని ద్వారా వచ్చే పారితోషకంతో ఒక కారు కొనుక్కుంటే చాలు అనుకున్నానని ఆమె తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించడం విశేషం. తాను కాలేజీలో చదువుకుంటున్న సమయంలో అనుకోకుండా కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తనకు ఒక అవకాశం వచ్చిందని.. ఎవరో కొందరు తన ఫొటోలు చూసి తన తండ్రిని కలిసి తమ చిత్రంలో నటించమని అడిగారని రకుల్ వెల్లడించింది. అప్పుడు తనకు ఏం చెప్పాలో అర్థం కలాలేదని.. సినిమాలపై తనకు అప్పుడంత అవగాహన లేదని రకుల్ తెలిపింది.

ఐతే ఈ సినిమాలో నటిస్తే రూ.5 లక్షల పారితోషకం ఇస్తామని అన్నారని.. ఆ డబ్బులతో కారు కొనుక్కోవచ్చని.. అప్పుడు తన స్నేహితుల బృందంలో కారు కొన్న తొలి అమ్మాయిని తానే అవుతాననే ఒకే కారణంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని రకుల్ తెలిపింది. ఐతే ఆ సినిమా కోసం 40 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాక కెమెరా ముందు ఉండడం తనకెంతో ఇష్టమని గ్రహించానని.. అప్పుడే నటనను సీరియస్‌గా తీసుకున్నానని.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని.. అలా 2013లో పూర్తి స్థాయిలో సినీ రంగంలోకి అడుగుపెట్టానని ఆమె వెల్లడించింది.

ఎవరి ప్రమేయం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్నీ సొంతంగా నేర్చుకున్నాననంది. తొలి సినిమా చేశాక కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, చదువు కోసం వాటిని వదులుకున్నట్లు ఆమె చెప్పింది. కారు కోసం రకుల్ చేసిన కన్నడ సినిమా పేరు.. గిల్లి. తర్వాత ఆమె 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.