కిరణ్ అబ్బవరం అడుగులు ఎటువైపు

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కిరణ్ అబ్బవరం భారీ నమ్మకం పెట్టుకున్నాడు. క, కె ర్యాంప్ విజయాలు సాధించినప్పటికీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ వస్తే తన మార్కెట్ మరింత పెరుగుతుందనే అంచనాతో ఈ సినిమా కోసం చాలా సమయం ఖర్చు పెట్టాడు. ముఖ్యంగా రచన చేసిన సాయి రాజేష్ బేబీని మించి ఉంటుందని చేస్తున్న పోలిక యూత్ లో అంచనాలు పెంచుతోంది. ఇవి నిజమైతే మటుకు బ్లాక్ బస్టర్ పడిపోతుంది.

నిన్నటిదాకా కిరణ్ చిన్న హీరోనే. క్రమంగా తన ఇమేజ్ విస్తరించుకునే పనిలో ఉన్నాడు. మైత్రి రవి లాంటి అగ్ర నిర్మాత పబ్లిక్ స్టేజి మీద ఒరిజినల్ స్టార్ అని సంబోధించడం యధాలాపంగా జరిగింది కాదు. టాప్ ప్రొడ్యూసర్ గా ఆయనకు బిజినెస్ వ్యవహారాలు బాగా తెలిసి ఉంటాయి కాబట్టే ఆ మాటన్నారు. పైగా నానితో పోల్చడం పెద్ద ప్రమోషన్ లాంటిది. మైత్రి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇక్కడ కారణం కాదు. అలా అయితే కేవలం సినిమాను పొగిడితే సరిపోతుంది కానీ కిరణ్ ను కాదు.

ప్రస్తుతం టాలీవుడ్ లో టయర్ 2 హీరోల మధ్య మంచి కాంపిటీషన్ నడుస్తోంది. వేగంగా దూసుకెళ్లేవాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నానిని మినహాయిస్తే విజయ్ దేవరకొండ, నిఖిల్, సిద్దు జొన్నలగడ లాంటి వాళ్ళు వరస ఫెయిల్యూర్స్ తో స్లో అయిపోయారు. చేతిలో సినిమాలున్నాయి కానీ నడక మరీ నెమ్మదిగా ఉంది. అఖిల్ కు దశాబ్దం తర్వాత హిట్టు పడింది. నాగచైతన్య ఏడాదికి ఒకటే ఇస్తున్నాడు. కిరణ్ లాంటి వాళ్లకు ఈ స్పేస్ బాగా ఉపయోగపడుతుంది.

అసలే దర్శకుడిగా కిరణ్ అబ్బవరం త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడీ చెన్నై లవ్ స్టోరీతో సాలిడ్ హిట్ అందుకుంటే తన డైరెక్షన్ డెబ్యూకి మరింత బిజినెస్ వస్తుంది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతే వంద కోట్ల బొమ్మలను టార్గెట్ గా పెట్టుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల లిస్టులో రవితేజ, నాని, సిద్దు లాంటి వాళ్ళ తర్వాత కిరణ్ పేరే వినిపిస్తోంది. కాకపోతే దాన్ని సరైన దిశలో వాడుకుంటూ దిల్ రుబా లాంటి తప్పులు చేయకుండా ఉంటే చాలు.