జాతీయ అవార్డుల్లో ఎంత మార్పో…

ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తుంటే.. తెలుగు సినిమాకు ప్రాతినిధ్యం దక్కితే ఆశ్చర్యపోయేవాళ్లం. మన సినిమాలకు ఏదైనా విభాగంలో జాతీయ అవార్డు రావడం సంగతి అటుంచితే.. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా తెలుగు నుంచి ఏ సినిమానూ ప్రకటించిన సంవత్సరాలు కూడా చాలానే ఉన్నాయి. 2007-11 మధ్య అయిదు సంవత్సరాల్లో నాలుగుసార్లు బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డుకు ఏ సినిమా ఎంపిక కాని పరిస్థితి.

అలా అని ఆ సంవత్సరాల్లో సరైన సినిమాలు రాలేదా అంటే అదేమీ కాదు. కానీ అప్పట్లో జ్యూరీలో ఉండే పెద్ద మనుషులకు తెలుగు సినిమాలంటే చిన్నచూపుండేది. అందుకే ఇక్కడ అర్హత ఉన్న సినిమాలున్నా.. ఇక్కడి నటులు, టెక్నీషియన్లు అవార్డులకు అర్హమైన పనితనం చూపించినా పట్టించుకునే వారు కాదు. కానీ 2015లో బాహుబలి అనే సినిమా వచ్చి దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాక తెలుగు సినిమాలను చూసే కోణమే మారిపోయింది.

ఆ సినిమా స్ఫూర్తితో మన దగ్గర మరెన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. ఫలితంగా గత దశాబ్ద కాలంగా జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా వెలిగిపోతూ ఉంది. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు దక్కిన పురస్కారాలు తొమ్మిది కావడం విశేషం. ఒక్క అవార్డైనా వస్తుందా.. కనీసం ప్రాంతీయ భాషా చిత్రంగా అయినా తెలుగు నుంచి ఏదైనా సినిమా ఎంపికవుతుందా అని చూసిన రోజుల నుంచి.. ఈ స్థాయికి తెలుగు సినిమా ఎదగడం గమనార్హం.

గత దశాబ్ద కాలంలో తెలుగు నుంచి ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ స్క్రీన్ ప్లే (సుకుమార్, సాయిరాజేష్), ఉత్తమ డైలాగ్ రైటర్ (వెంకీ అట్లూరి), ఉత్తమ సంగీత దర్శకుడు (తమన్).. ఇలా ఎన్నో అత్యున్నత పురస్కారాలు చూశాం. జాతీయ అవార్డుల జ్యూరీ.. తెలుగు సినిమాల మీద ఇంతగా దృష్టిపెట్టి, మన ప్రతిభను గుర్తించేలా చేయడంలో రాజమౌళి పాత్ర ఎంతో కీలకం అనడంలో సందేహం లేదు. ‘బాహుబలి’ తర్వాతే ఈ మార్పు సాధ్యమైందనడంలో మరో మాట లేదు.