కొరియా అమ్మాయితో గల్లా అశోక్ పెళ్లి

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో త్వరలోనే పెద్ద శుభకార్యం జరగబోతోంది. ఆయన మనవడు అశోక్ గల్లా పెళ్లి కొడుకు కాబోతున్నాడు. అతను తన ఎంగేజ్మెంట్‌తో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అశోక్ పెళ్లి చేసుకోబోయేది ఒక దక్షిణ కొరియా అమ్మాయిని కావడం విశేషం. తన పేరు.. హెయిన్ కిమ్. కొన్నేళ్ల నుంచి ఈ అమ్మాయితో అశోక్ ప్రేమలో ఉన్నాడట. 

తాజాగా ఇరు కుటుంబాల సమ్మతితో ఈ ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో పెళ్లి కూతురు ఇక్కడి అమ్మాయిలా రెడీ అయింది. ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల మహేష్ ఈ వేడుకకు హాజరు కాలేకపోయాడు. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్.. నిశ్చితార్థానికి హాజరై కాబోయే వధూవధురులకు శుభాకాంక్షలు చెప్పారు. ఘట్టమనేని, గల్లా కుటుంబాలకు చెందిన ఇతర ముఖ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.

మహేష్ సోదరి పద్మావతి, ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ల తనయుడే అశోక్ గల్లా. తల్లి వైపే కాదు.. తండ్రి వైపు కూడా అశోక్‌కు ఘనమైన వారసత్వం ఉంది. అతడి నానమ్మ గల్లా అరుణ కుమార్ వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేశారు. ఆమె భర్త గల్లా రామచంద్ర నాయుడు అమర్ రాజా గ్రూప్ ఆధ్వర్యంలో గల్లా ఫుడ్స్‌, యామరాన్ బ్యాటరీస్ సహా పలు వ్యాపారాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించారు. 

అశోక్ తండ్రి గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు ఎంపీగా సేవలందించారు. కానీ వైసీపీ హయాంలో తనను టార్గెట్ చేయడంతో జయదేవ్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. తండ్రి బాటలో వ్యాపారంలోకి వెళ్లకుండా తల్లి కుటుంబ వారసత్వాన్ని అందుకుని అశోక్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఐతే తన తొలి రెండు చిత్రాలు ‘హీరో’, ‘దేవకీ నందన వాసుదేవ’ నిరాశపరిచాయి. ఇప్పుడతను శ్రీ గౌరీప్రియతో కలిసి ‘వీసా’ అనే మరో చిత్రంలో నటించాడు. అది త్వరలో విడుదల కాబోతోంది.