తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. నటుడిగానే కాక నిర్మాతగా, స్టూడియో యజమానిగా నాగార్జున ఎంతో సంపాదించాడు. ఆయనకు వేరే వ్యాపారాలూ ఉన్నాయి. కానీ తాను ఎన్ని విజయాలు సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా.. కొడుకులు సక్సెస్ కానపుడు సంతోషంగా ఎలా ఉంటారు? పెద్ద కొడుకు నాగచైతన్య కెరీర్ ఆరంభంలో కొంచెం కష్టపడి.. తర్వాత మిడ్ రేంజ్ హీరోగా స్థిరపడ్డాడు. అయినా సరే ఒక దశలో చైతూ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. మరోవైపు అఖిల్ హీరోగా నిలదొక్కుకోలేక ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే.
దీంతో కొడుకులిద్దరినీ ఎలాగైనా నిలబెట్టాలని నాగ్ ఎంతో తపించాడు. ఈ క్రమంలోనే తన సినిమాలను కూడా పక్కన పెట్టి వారి కెరీర్ల మీద ఫోకస్ చేశాడు. గీతా ఆర్ట్స్‌లో ‘తండేల్’ లాంటి ప్రామిసింగ్ ప్రాజెక్టు సెట్ చేశాడు. నాగ్ అభిమాని అయిన చందు మొండేటి రూపొందించిన ఈ చిత్రం మంచి ఫలితాన్నందుకుంది. నాగ్ మరీ ఇన్వాల్వ్ కాకపోయినా.. ఈ ప్రాజెక్టు సెట్ కావడంలో నాగ్ పాత్ర కూడా ఉంది. చైతూ కెరీర్‌కు కీలకం కావడంతో నాగ్ ముందే సినిమా చూసి మార్పులు చేర్పులు సూచించాడు.
ఇక అఖిల్ మూవీ ‘లెనిన్’లో నాగ్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడో తెలిసిందే. ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి కావడమే కాదు.. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తన సినిమాలకు కూడా పెట్టనంత ఎఫర్ట్ నాగ్ ఈ సినిమా కోసం పెట్టాడని టీం చెబుతున్న మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా రిలీజ్ రోజు సక్సెస్ సెలబ్రేషన్లలో అఖిల్.. తండ్రిని పట్టుకుని ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. ఆ టైంలో నాగ్ కూడా కన్నీళ్లు పెట్టేసుకున్నారు.
మొత్తానికి ఏడాదిన్నర వ్యవధిలో అక్కినేని అన్నదమ్ములిద్దరూ హిట్లు కొట్టేశారు. ఇక మిగిలింది నాగార్జునే. ఆయన కూడా ఒక పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్లయింది. ఇప్పుడాయన తన వందో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటిదాకా ఏ విశేషమూ పంచుకోలేదు. సైలెంటుగా షూటింగ్ చేసుకుపోతున్నాడు నాగ్. చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా విజయవంతం అయితే.. అక్కినేని వారి జైత్రయాత్ర పరిపూర్ణం అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates