‘కోట’ చేసిన సంతకం ఎప్పటికీ శాశ్వతం

కొందరు నటులకు మరణం ఉండదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వాళ్ళ పాత్రలు సజీవంగా ఉంటూ తరాలు గడిచినా నిత్య నూతనంగా అలరిస్తాయి. అలాంటి వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారిది ప్రత్యేక స్థానం. గత ఏడాది ఇదే నెలలో కన్ను మూసిన ఈ యాక్టింగ్ లెజెండ్ చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా హరిహర వీరమల్లులో కాసేపు కనిపించే స్పెషల్ క్యామియో చేశారు. డెడికేషన్ అంటే ఏంటో నిరూపించారు. ఇవాళ జూలై 10 కోట శ్రీనివాసరావు జయంతి.

కోట శ్రీనివాసరావు గారి గొప్పదనం తెలియాలంటే ఇప్పుడున్న కొందరు ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, డబ్బింగ్ కొలమానంగా తీసుకుంటే చాలు. అరువు తెచ్చుకున్న గొంతులు, బీజీఎమ్ మీద ఆధారపడిన ఎలివేషన్లతో ఏదో మొక్కుబడిగా నటిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ కోట అలా కాదు. గణేష్ లో వెంకటేష్ హీరోయిజం ఎలివేట్ అవ్వడానికి, రౌడీ అల్లుడులో చిరంజీవి మావయ్యగా నవ్వించడానికి, ఆ నలుగురిలో వడ్డీలు వసూలు చేసిన పిసినారితనానికి వేరొకరిని ఊహించుకోలేం.

విలన్ గానే కాకుండా కమెడియన్ గా కోట పూయించిన నవ్వులు వేలల్లో ఉంటాయి. ముఖ్యంగా బాబు మోహన్ కాంబినేషన్ లో చేసిన మామగారు, బావ బావమరిది లాంటి సూపర్ హిట్లు వీళ్ళ వల్లే ఒక పాతిక రోజులు ఎక్స్ ట్రా ఆడాయంటే అతిశయోక్తి కాదు. ఆమెలో కోడలు మీద కన్నేసే స్వార్థపరుడైన మామగా కోట నటనకు విమర్శకులు చప్పట్లు కొట్టారు. హలో బ్రదర్ లో ఎస్ఐ మట్టయ్యగా ప్రీ క్లైమాక్స్ దాకా నవ్వించి చివరి ఘట్టంలో ఏడిపించి మెప్పించడం ఆయనకే చెల్లింది.

పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం కోటను గౌరవించినా, వందల వేల అవార్డులు ఇంటిని అలకరించినా కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం చెక్కు చెదరనిది. ఎస్విఆర్, సత్యనారాయణ, నాగభూషణం, రావుగోపాల్ రావు తర్వాత అంతటి విలక్షణమైన నటన కోటలో తప్ప ఇంకెవ్వరిలోనూ కనిపించదంటే అతిశయోక్తి కాదు. అందుకే కోట శ్రీనివాసరావు గారు శాశ్వతంగా సెలవు తీసుకున్నా ఇలాంటి సందర్భాలువ్ వచ్చిన ప్రతిసారి ఆయన చేసిన సంతకం విలువ తెలుస్తుంది.