మణిరత్నం మార్కుతో మీడియం సినిమా

పరిచయమే అక్కర్లేని పేరు మణిరత్నం. దక్షిణాదిలో ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ సీనియర్ లెజెండ్ చాలా కాలంగా ఆయన స్థాయి సినిమాలు తీయడం లేదు. బాహుబలి స్ఫూర్తితో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలు తీశారు కానీ తమిళనాడు నుంచి మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. తర్వాత కమల్ హాసన్ తగ్ లైఫ్ ఎంత డిజాస్టరో చెప్పనక్కర్లేదు. నాయకుడు వచ్చిన 38 సంవత్సరాల తర్వాత జరిగిన కలయిక సినీ ప్రియులను తీవ్రంగా నిరాశ పరిచింది.

తర్వాత శింబుతో ఒక మూవీ ప్లాన్ చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఒక దశలో నవీన్ పోలిశెట్టిని కూడా ట్రై చేశారట. తనేమో సున్నితంగా నో చెప్పినట్టు టాక్ వచ్చింది. చెన్నై వర్గాల ప్రకారం మణిరత్నం కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. విజయ్ సేతుపతి, సాయిపల్లవి కాంబోలో ఒక రామ్ కామ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సఖి, ఓకే బంగారం తరహాలో ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తయ్యేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు.

ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టి ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్రాధమికంగా నిర్ణయించుకున్నారట. ముప్పై సంవత్సరాల అనుబంధాన్ని కొనసాగిస్తూ దీనికి కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చబోతున్న విషయం ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటోంది. మణిరత్నం తన మేజిక్ ని పదే పదే ఋజువు చేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన స్థాయికి తగ్గ కంటెంట్స్ ఇవ్వమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఒకవేళ తగ్ లైఫ్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇంకో ప్యాన్ ఇండియా మూవీ తీసేవారేమో కానీ ఇప్పుడా ఛాన్స్ లేకుండా పోయింది. శంకర్ కూడా ఇదే సమస్యతో బాధ పడుతున్నారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ దెబ్బకు ఆయన అడిగిన బడ్జెట్ లు కేటాయించేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు రావడం లేదు. అందుకే శంకర్ డ్రీం ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. ఆయన కూడా ఒక మీడియం బడ్జెట్ సినిమా తీసి దాంతో ప్రూవ్ చేసుకున్నాక తిరిగి గ్రాండియర్స్ వైపు వస్తారట.