అఖిల్ మీద నమ్మకం వచ్చేసినట్టే

అయ్యగారు కంబ్యాక్ అంటూ అభిమానులే సరదాగా హాస్యమాడే అఖిల్ జూలై 10 లెనిన్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా దీని మీద సాధారణ ప్రేక్షకుల్లో భీభత్సమైన అంచనాలు లేవు. మునుపటి సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ గా ఉండొచ్చన్న అంచనా తప్ప ప్రత్యేకంగా ఆలోచించలేదు. కానీ ట్రైలర్ వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. పల్లెటూరి నేపథ్యంలో విలేజ్ పాలిటిక్స్ తో పాటు ప్రేమకథ, రివెంజ్ డ్రామా పొందుపరిచిన వైనం స్పష్టంగా కనిపించింది.

ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మాస్ సినిమాకు రావాల్సిన బజ్ ఏదైతే ఉందో అది తెచ్చుకోవడంలో లెనిన్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అఖిల్ కెరీర్ లో మొదటిసారిగా ఇలాంటి డౌన్ టు ఎర్త్ పాత్ర చేయడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం సమకూర్చారు. 90స్ మిడిల్ క్లాస్, కోర్టు, దండోరా తర్వాత శివాజికి మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ పడిందట.

ఇవన్నీ సానుకూలంగా అనిపిస్తున్నాయి. గ్రామీణ నేపధ్యాన్ని సరిగ్గా వాడుకుంటే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో రంగస్థలం నుంచి బలగం దాకా ఎన్నో నిరూపించాయి. పెద్దిలో ప్రీ క్లైమాక్స్ ఎమోషన్ డోస్ ఎక్కువ కాకపోయి ఉంటే అది కూడా అన్ని భాషల ఆడియన్స్ ని మెప్పించేది. అది లేకపోవడం వల్లే సక్సెస్ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యింది. నానికి దసరాలాగా అఖిల్ కి ఈ లెనిన్ నిలుస్తుందనే నమ్మకం చిత్ర బృందంలో బలంగా ఉంది.

పాజిటివ్ టాక్ వస్తే మటుకు లెనిన్ కు మంచి థియేటర్ రన్ దక్కుతుంది. ఎందుకంటే మా ఇంటి బంగారం ఆ టైంకంతా స్లో అయిపోతుంది. ఆపై వారం కూడా చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. సో లెనిన్ కనక పబ్లిక్ పల్స్ పట్టుకుంటే వసూళ్ల పండగే. కథలో చాలా ట్విస్టులు ఉంటాయని, ట్రైలర్ ని బట్టి కథ మీద ఒక అంచనాకు వచ్చేయడం తప్పని స్క్రీన్ మీద చూశాక ఋజువవుతుందని టీమ్ కాన్ఫిడెన్స్. దర్శకుడు మురళికిషోర్ నిజంగా అంత మేజిక్ చేస్తే మంచిదే.