పల్లెటూరి జాతరలో ‘లెనిన్’ కురుక్షేత్రం

అక్కినేని అభిమానుల ఎదురుచూపులకు పరీక్ష పెడుతూ వచ్చిన లెనిన్ ఎట్టకేలకు జూలై 10 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ వైజాగ్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్లో కథేంటో ఎక్కువగా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు. ఈ రోజు దానికి క్లారిటీ ఇచ్చారు. మూడు నిమిషాల వీడియోలో ఫ్యాన్స్ ఏమేం ఆశించాలో అదంతా పొందుపరిచి శాంపిల్ అందించారు.

చిత్తూరు జిల్లా శ్రీరామపురం అనే చిన్న ఊరిలో పద్దెనిమిది రోజుల పాటు ద్రౌపదమ్మ జాతర జరుగుతుంది. చుక్క నెత్తురు రాలకుండా జనాలు పాటించే సంప్రదాయం కఠినంగా ఉంటుంది. అక్కడికి రాజకీయ నాయకుడైన స్నేహితుడి కోసం వచ్చిన ఓ కుర్రాడు (అఖిల్) ఆ ఊరి అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. అయితే ఊహించని సంఘటనల వల్ల అక్కడ కురుక్షేత్రం మొదలవుతుంది. మిత్రుడు, ప్రియురాలు ఇద్దరూ ప్రమాదంలో పడతారు. కత్తి పట్టిన లెనిన్ ఏం చేశాడనేది అసలు స్టోరీ.

పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అఖిల్ చాలా కొత్తగా ఉన్నాడు. గెటప్ తో పాటు ఆహార్యం, భాష, డైలాగ్ డెలివరీ అన్నీ విభిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషన్, యాక్షన్ ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో బెస్ట్ ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేశాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో శివాజీ, సునీల్ తదితర ఆర్టిస్టులను రివీల్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ కు ఉపయోగపడగా సినిమా ఎక్కువగా అఖిల్ వన్ మ్యాన్ షోలాగా ఫ్యాన్స్ ని అలరించేలా ఉంది.

భారీ బ్లాక్ బస్టర్ కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూసిన అఖిల్ ఎట్టకేలకు మంచి సబ్జెక్టునే ఎంచుకున్నాడు. రంగస్థలం రామ్ చరణ్ కు బ్రేక్ ఇచ్చినట్టు ఇప్పుడీ లెనిన్ అఖిల్ కు కొత్త మలుపు అవుతుందేమో చూడాలి. కాంపిటీషన్ లేకుండా మంచి టైమింగ్ చూసుకుని వస్తున్న ఈ పల్లెటూరి వయొలెంట్ డ్రామా కనక క్లిక్ అయితే సాలిడ్ హిట్టు పడ్డట్టే. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ తో పాటు మనం ఎంటర్ ప్రైజెస్ ఇందులో నిర్మాణ భాగస్వాములుగా ఉంటున్నాయి.