తెలుగమ్మాయి అయిన సుధ కొంగరకు తమిళంలో దర్శకురాలిగా ఎంత మంచి పేరుందో తెలిసిందే. తమిళంలో ఆమె తొలి చిత్రం ‘ఇరుదు సుట్రు’ సూపర్ హిట్ అయింది. తెలుగులో దాన్ని ‘గురు’గా తీస్తే ఇక్కడా బాగా ఆడింది. ఆపై ఆమె రూపొందించిన ‘ఆకాశం నీ హద్దురా’ క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది. రాశి కంటే వాసి ముఖ్యమనన ఉద్దేశంతో ఈ మణిరత్నం శిష్యురాలు నెమ్మదిగా, ఆచితూచి సినిమాలు చేస్తుంటుంది.
‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత కొత్త సినిమా చేయడానికి ఆమె చాలా సమయమే తీసుకుంది. సూర్యతోనే చేయాలనుకుని, తర్వాత కొన్ని కారణాలతో ఆలోచన మార్చుకుని ఆమె శివకార్తికేయన్‌తో చేసిన సినిమా.. పరాశక్తి. అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచే ఈ చిత్రం ఎంతో ఆసక్తి రేకెత్తించింది. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్లో తీసిన ఈ పీరియడ్ మూవీ నిర్మాతకు, బయ్యర్లకు భారీ నష్టాలే తెచ్చిపెట్టింది.
ఐతే ఈ సినిమా తీసినందుకు తనకు ఇవ్వాల్సిన పారితోషకం ఇవ్వలేదంటూ తాజాగా నిర్మాతల మీద దర్శకురాలు సుధ కొంగర కోర్టుకు ఎక్కడం చర్చనీయాంశం అయింది. రూ.8 కోట్లకు పైగా తనకు ప్రొడ్యూసర్ బకాయి పెట్టడంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో పరాశక్తి శాటిలైట్ రిలీజ్ ఆగిపోయింది. ఐతే నిర్మాత వెర్షన్ వేరుగా ఉంది.
ఈ సినిమాకు సుధకు పారితోషకం ఇచ్చేలా ఒప్పందం జరగలేదని.. రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకునేలా మాట అనుకున్నామని.. సినిమా సరిగా ఆడని నేపథ్యంలో ఆమెకు అంత పారితోషకం ఎలా ఇస్తామని ప్రొడ్యూసర్ వాదిస్తున్నారట. కొంతమేర తగ్గించి ఆమెకు రెమ్యూనరేషన్ ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. కానీ సుధ మాత్రం కొన్నేళ్ల పాటు స్క్రిప్టు రాసి.. మరి కొన్నేళ్లు సినిమా తీసి అంత కష్టపడితే తనకు రావాల్సిన మొత్తం అందాల్సిందే అని వాదిస్తోంది. మరి కోర్టుకు చేరిన ఈ వ్యవహారంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates