స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ దానికి భిన్నంగా కనిపిస్తోంది. రెండు కంటెంట్ నమ్ముకున్న సినిమాలు, అవి కూడా డైరెక్టర్ ఇమేజ్ మీద ఎక్కువ బిజినెస్ చేయలేని పరిస్థితిలో ప్రమోషన్లు, ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేసుకున్నాయి. వాటిలో మొదటిది రావు బహదూర్. సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ డ్రామాకు మహేష్ బాబు నిర్మాణ భాగస్వామి కావడం అసలు విశేషం.
సత్యదేవ్ ని ఏకంగా కమల్ హాసన్ తో పోల్చే రేంజ్ లో దర్శకుడు వెంకటేష్ మహా ఎలివేషన్ ఇవ్వడంతో అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ కి భిన్నంగా టిపికల్ క్యారెక్టరైజేషన్ లో సత్యదేవ్ చూపించే షేడ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని అంటున్నారు. స్క్రీన్ ప్లేలో తన మార్కు ప్రయోగం కేరాఫ్ కంచెరపాలెంలో చూపించిన వెంకటేష్ మహా ఈసారి దానికి పదింతలు కనికట్టు చేయబోతున్నారని నిర్మాతలు బల్లగుద్ది చెబుతున్నారు.
క్లిక్ అయితే సంతోషమే. ఎంతసేపూ మలయాళం మూవీ మేకింగ్ ని భుజాన మోసే తెలుగు యువతకు రావు బహదూర్ రూపంలో ఒక సమాధానం దొరుకుతుంది. నాగబంధం విషయానికి వస్తే అబ్బురపరిచే గ్రాఫిక్స్ తీసుకుని అనంత పద్మనాభస్వామి స్ఫూర్తితో రాసుకున్న ఫాంటసీ కథ ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో హైప్ తీసుకొచ్చింది. హీరో విరాట్ కర్ణ ఇమేజ్ మార్కెట్ లో జీరో అయినప్పటికీ దర్శకుడు అభిషేక్ నామా కంటెంట్ వల్ల జనాల్లో ఇంటరెస్ట్ రేగుతోంది.
ఈ రెండు సినిమాలకు పబ్లిక్ టాక్, రివ్యూలు చాలా కీలకం కాబోతున్నాయి. ఓపెనింగ్స్ భారీగా వస్తాయని చెప్పలేం కానీ బాగుందనే టాక్ వస్తే సాయంత్రం షోల నుంచే సీన్ మారిపోయి హౌస్ ఫుల్ బోర్డులు పడతాయి. ఆ మాట చాలా కీలకం. ఏ మాత్రం హెచ్చుతగ్గులు ఉన్నా ఆ ప్రభావం వెంటనే కనిపిస్తుంది. మా ఇంటి బంగారం క్రమంగా నెమ్మదిస్తున్న తరుణంలో ఆ అవకాశాన్ని రావు బహదూర్, నాగబంధం ఒడిసిపట్టుకోవాలి. ముందు రోజే రెండింటికి ప్రీమియర్లు వేసేలా ప్లానింగ్ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates