గేమ్ చేంజర్ ఎందుకు ఆడలేదు?

తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన ఇక్కడి టాప్ స్టార్లతో నేరుగా తెలుగు సినిమాలు తీస్తే చూడాలని చాలా ఏళ్లు ప్రేక్షకులు ఎదురు చూశారు. చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడు స్టేజ్ మీద ఓపెన్‌గా శంకర్‌తో సినిమా చేయాలనుందన్నారు. కానీ కెరీర్ పతాక స్థాయిలో ఉండగా ఆ ప్రయత్నం చేయని శంకర్.. ఫామ్ కోల్పోయాక చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేశాడు.

అయినా సరే దీనిపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను సినిమా ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయింది. ఈ సినిమా దిల్ రాజు సంస్థ పునాదులనే కదిపేసే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా మొదలైనపుడు ఎంతో ఎగ్జైట్ అయిన రాజు.. రిలీజ్ టైంకి దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అదే టైంలో రిలీజైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పుణ్యమా అని ఆయన బయటపడ్డాడు.

‘గేమ్ చేంజర్’ ఫెయిల్యూర్ గురించి రిలీజప్పుడు పెద్దగా మాట్లాడని రాజు.. ఈ మధ్య ‘గాయపడ్డ సింహం’ ఈవెంట్లో మిమ్మల్ని ఎక్కువ గాయపరిచిన సినిమా ఏది అంటూ పరోక్షంగా ‘గేమ్ చేంజర్’ గురించి అడిగినా స్పందించకుండా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి ఓపెన్ అయ్యారు. ఈ సినిమా ప్రొడక్షన్ విపరీతంగా ఆలస్యం కావడమే ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణమని రాజు తేల్చేశారు. ఈ ఆలస్యం వల్ల ఫైనాన్స్ వడ్డీల భారం, బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.

దీనికి తోడు రిలీజ్ టైమింగ్ కూడా మారి అది కూడా ప్రతికూలంగా మారిందన్నారు. రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో సాగే ఈ సినిమా 2024 ఎలక్షన్స్‌కు ముందు రిలీజై ఉంటే బాగుండేదని.. ఆ టైమింగ్ మిస్ అయిపోవడంతో ప్రేక్షకులు ఈ కథతో కనెక్ట్ కాలేదని రాజు చెప్పారు. ‘గేమ్ చేంజర్’ వల్ల తమకు భారీ నష్టమే వచ్చిందని.. కానీ అదృష్టవశాత్తూ అదే టైంలో రిలీజైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ వల్ల 80 శాతం నష్టాలు భర్తీ అయి తాము గట్టెక్కామని రాజు చెప్పారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ స్థాయిలో లాభాలు అందించే సినిమాలు చాలా అరుదుగా వస్తాయని ఆయనన్నారు. మొత్తానికి రామ్ చరణ్ అభిమానులు హర్ట్ అవ్వని విధంగా.. శంకర్‌ చేసిన ఆలస్యం వల్లే ‘గేమ్ చేంజర్’ పోయిందన్నట్లుగా జాగ్రత్తగా ఈ ఫెయిల్యూర్ గురించి విశ్లేషించారు రాజు.