గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది. అయినా సరే.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. తొలి వీకెండ్లో రూ.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. సోమవారం కూడా కలెక్షన్లు ఆశాజనకంగానే కనిపించాయి. కానీ తర్వాత ఈ సినిమా జోరు తగ్గింది. డివైడ్ టాక్ మిడ్ వీక్‌లో ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపించాయి. దీనికి తోడు వర్షాలూ కొంత దెబ్బ కొట్టాయి. 

మరోవైపు ప్రేక్షకుల దృష్టి ‘స్పైడర్ మ్యాన్’ వైపు మళ్లడంతో ‘చెన్నై లవ్ స్టోరీ’కి ఇక కష్టమే అనుకున్నారంతా. గురువారం పూర్తిగా ‘స్పైడర్ మ్యాన్’ హవానే సాగడంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ దగ్గర బాగా డల్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. రెండో వీకెండ్లో ఈ సినిమా నిలవడం కష్టమే అనుకున్నారు. కానీ ‘స్పైడర్ మ్యాన్’ పోటీని తట్టుకుని ఈ సినిమా బలంగానే నిలబడింది. 

తెలుగు రాష్ట్రాల్లో ‘స్పైడర్ మ్యాన్’ బాగా ఆడుతున్నా సరే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. శుక్రవారం సాయంత్రం, రాత్రి షోలకు మంచి ఆక్యుపెన్సీలే కనిపించాయి. శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. మేజర్ సిటీస్‌లో ఈ సినిమాకు ఈవెనింగ్, నైట్ షోలు ఫుల్స్ పడినా ఆశ్చర్యం లేదు. ఆదివారం కూడా మంచి రన్ ఉంటుందని భావిస్తున్నారు. ‘స్పైడర్ మ్యాన్’ను పక్కన పెడితే.. ఈ వారం రిలీజైన ‘శ్రీనివాస మంగాపురం’, ‘న్యూటన్స్ థర్డ్ లా2, ‘కర్మాఖ్య’ లాంటి చిత్రాలు ‘చెన్నై లవ్ స్టోరీ’ని దెబ్బ తీయలేకపోయాయి. 

కొత్త సినిమాల కంటే పాత చిత్రమైన ఇదే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. డివైడ్ టాక్‌తో మొదలైన సినిమా.. రెండో వీకెండ్లో ‘స్పైడర్ మ్యాన్’ ప్రభంజనాన్ని తట్టుకుని నిలవడమంటే మాటలు కాదు. ఈ సినిమా ఇప్పటికే రూ.40 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఫుల్ రన్లో రూ.50 కోట్ల సినిమాగా నిలవబోతోంది. ‘క’ వసూళ్లను దాటి కిరన్ అబ్బవరం కెరీర్లో ఇది హైయెస్ట్ గ్రాసర్‌ కాబోతోంది. కిరణ్ సరసన శ్రీగౌరీప్రియ నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ స్క్రిప్టుతో రవి నంబూరి రూపొందించాడు. ఎస్కేఎన్‌తో కలిసి సాయి రాజేష్ ఈ మూవీని నిర్మించాడు.