రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్ అయ్యారు. దీని వల్ల ప్రశాంతంగా ఇంట్లోనే కూచుని చూద్దామనుకున్న వాళ్లకు షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్ మరియు ఇతర సృజనాత్మకత హక్కులు తమకు ఉన్నాయని చెబుతూ రాజ్ కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మద్రాస్ హైకోర్టుని సంప్రదించడంతో దృశ్యం 3 తెలుగు మీద న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం ఒరిజినల్ మలయాళంతో పాటు తమిళ హిందీ భాషల్లో దృశ్యం 3 అందుబాటులోకి రావొచ్చేమో కానీ తెలుగు మాత్రం కాదు. ఒకవేళ మొత్తంగా వాయిదా వేస్తారా లేక ఒక భాష మీద అభ్యంతరం వచ్చింది కాబట్టి మిగిలినవి యధాతథంగా కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ చూడకుండా ఉండలేని వాళ్ళు సబ్ టైటిల్స్ సహాయంతో కానిచ్చేయాలి. థియేటర్ రిలీజ్ జరిగిన మొదటి మూడు రోజులు దృశ్యం 3 ఏపీ తెలంగాణలో డీసెంట్ వసూళ్లు రాబట్టింది.
కోర్టు కేసు సంగతి పక్కనపెడితే దృశ్యం 3 రీమేక్ అయ్యే అవకాశాలు దాదాపు లేనట్టే. ఎందుకంటే వెంకటేష్ ఎప్పుడో తప్పుకున్నారు. దర్శకుడు జీతూ జోసెఫే ఇతర స్టార్ హీరోలను ఇలాంటి క్లైమాక్స్ లో చూపిస్తే అభిమానులు ఒప్పుకోకపోవచ్చని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అందుకే అజయ్ దేవగన్ హిందీ వెర్షన్ లో కీలక మార్పులు చేసుకున్నారు. ఇదంతా ఎందుకు వచ్చిన గొడవలెమ్మని వెంకీ డ్రాప్ కావడంతో మోహన్ లాల్ తోనే దృశ్యం 3 తెలుగుని ముగించేశారు.
దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నప్పుడు కూడా దృశ్యం 3కి కొన్ని చిక్కులు వచ్చాయి. వాటిని సరిచేసుకుని మేలో రిలీజ్ చేశారు. ఇప్పుడు చూస్తేనేమో ఓటిటిలో ఈ ట్విస్టు వచ్చి పడింది. దీని తర్వాత కొనసాగింపు దాదాపు లేనట్టే. చివరి సీన్ లో నాలుగో భాగానికి చిన్న లీడ్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతానికి తన వద్ద ఎలాంటి ప్లాన్ లేదని చెప్పిన జీతూ జోసెఫ్ భవిష్యత్తులో అద్భుతమైన ఐడియా వస్తే తప్ప ఇక్కడితో చాప్టర్ క్లోజ్ అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates