డిజాస్టర్ బాధ్యత తనదే అన్న రైటర్

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్‌లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద విజయాన్నందుకుందో.. కాల క్రమంలో ఎలా క్లాసిక్‌గా నిలబడిందో తెలిసిందే. కానీ అలాంటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘థాంక్యూ’ పెద్ద డిజాస్టర్ అయింది. చైతూ కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఇదే. కథ పరంగా ఇందులో ఏ వైవిధ్యం కనిపించలేదు.

సాధారణంగా విక్రమ్ సినిమాల్లో ఎమోషన్లు ప్రధాన బలంగా ఉంటాయి. కానీ ఇందులో భావోద్వేగాలు అస్సలు పండలేదు. తొలి రోజే ఇది డిజాస్టర్ అని తేలిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం చూసి టీం మాత్రమే కాదు.. ఇండస్ట్రీ కూడా షాక్ అయింది. కానీ దీని తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్‌తో చైతూ, విక్రమ్ జోడీ ఆకట్టుకుంది. అది తెలుగు నుంచి వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌గా పేరు సంపాదించింది.

ఒకవైపు మనం.. ఇంకోవైపు దూత.. ఇలాంటి కంటెంట్ ఇచ్చిన విక్రమ్, చైతూ జోడీ ‘థాంక్యూ’ విషయంలో మాత్రం అంతగా ఫెయిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఈ సినిమా ఫెయిల్యూర్‌కు తనదే బాధ్యత అని ఇప్పుడు రచయిత బీవీఎస్ రవి చెప్పడం గమనార్హం.

‘థాంక్యూ’కు కథ అందించింది రవినే. మామూలుగా తన సినిమాలకు తనే కథ రాసుకునే విక్రమ్.. ఈ చిత్రానికి మాత్రం రవి స్టోరీని తీసుకున్నాడు.
ఐతే ‘థాంక్యూ’ ఫస్ట్ కాపీ చూసినపుడే ఇది ఫ్లాప్ అని అందరికీ అర్థమైపోయినట్లు రవి ఇప్పుడు వెల్లడించాడు.

సినిమా ఆడదని ఎడిటర్ నవీన్ నూలి ఓపెన్‌గానే చెప్పినట్లు తెలిపాడు. విక్రమ్ కుమార్ దేశంలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడని.. ఆయన ఫెయిలయ్యాడంటే అది కచ్చితంగా కథకుడిగా తన తప్పే అని రవి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక సినిమా ఫెయిలైతే ఇంకొకరి మీద నెపాన్ని నెట్టేయడానికి ప్రయత్నిస్తుంటారు చాలామంది. ఇలా తనదే బాధ్యత అని ఒక రైటర్ చెప్పడం విశేషమే.