టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎంకు అపర భక్తుడనని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మాట ముమ్మాటికీ నిజమనని బండ్ల గణేశ్ తన తాజా చర్యతో మరోమారు నిరూపించుకున్నారు. హన్మకొండకు చెందిన తన వీరాభిమాని నిరంజన్ ను పవన్ పరామర్శిస్తే… అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న నిరంజన్ కు బండ్ల గణేశ్ ఏకంగా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. తన నేతృత్వంలోని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నుంచి నిరంజన్ కుటుంబాన్ని ఆదుకునే దిశగా రూ.5 లక్షల సాయాన్ని ఇవ్వనున్నట్లు సదరు ప్రకటనలో బండ్ల గణేశ్ ప్రకటించారు. ఈ ప్రకటనలో నిరంజన్ అనారోగ్యం, అతడి కుటుంబ దీనావస్థను ప్రస్తావించిన గణేశ్…ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పవన్ చొరవ చూపిన విధానాన్ని ప్రత్యేకంగా కీర్తించారు.
ఇక తన ప్రకటనలో తనను తాను పవన్ భక్తుడనని కూడా గణేశ్ పేర్కొనడం గమనార్హం. “పవన్ కల్యాణ్ గారి భక్తుడిగా ఆయన స్ఫూర్తితో నిరంజన్ కు, అతడి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నాను” అంటూ గణేశ్ పేర్కొన్నారు. నిరంజన్ కోరికను తీర్చేందుకు పవన్ హన్మకొండకు బయటుదేరిన వెంటనే గణేశ్ ఈ ప్రకటనను విడుదల చేశారు.
పవన్ ను తన అభిమాన నటుడిగా పేర్కొన్న నిరంజన్… ఆయనను ఓసారి కలవాలనుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ బుధవారం నేరుగా హన్మకొండ వెళ్లి మరీ నిరంజన్ ను కలిశారు. ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబానికి పవన్ రూ.1 లక్ష సాయాన్ని అందించారు. అదే సమయంలో పవన్ బాటలో నడిచిన గణేశ్ కూడా నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల సాయాన్ని ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates