బుధవారం జోడింపులు వర్కౌట్ అయ్యేనా

పెద్దిలో కొత్త సీన్లు కలుపుతారని, కొంత ఎడిటింగ్ జరుగుతుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ బుధవారం నుంచి లేదా అటుపై ఒకటి రెండు రోజులు ఆటో ఇటో ఈ జోడింపులు ఉంటాయని స్పష్టంగా చెప్పేశారు. జాన్వీ కపూర్ కు సంబంధించి రెండు సీన్లు, జగపతిబాబు ఉండే సన్నివేశం, ఫినిషింగ్ అసంపూర్తిగా ఉన్న షాట్లను సరిచేసి కొత్త వెర్షన్ జనాల ముందుకు తెస్తామని అన్నారు.

అయితే ఇది అందుబాటులోకి వచ్చే నాటికి పెద్ది మూడో వారంలో అడుగు పెడుతుంది. ఇంత లేట్ గా ఇవి ఎంత మేరకు వర్కౌట్ అవుతాయంటే చెప్పడం కష్టం. ఎందుకంటే పెద్దిని అభిమానులు ఆల్రెడీ రిపీట్ షోలు చూసేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కడం కలెక్షన్లలో కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడో సానుకూలాంశం ఉంది. ఆ టైంలో రెగ్యులర్ రేట్లు ఏపీ తెలంగాణలో ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్, రిపీట్ ఆడియన్స్ మళ్ళీ షోలు వేసుకోవచ్చు.

టికెట్ రేట్ల పెంపు వల్ల థియేటర్ కు దూరంగా ఉన్న వాళ్ళు కొత్త వెర్షన్ తో పెద్దిని ఎంజాయ్ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా వసూళ్లకు దోహపడుతుంది. వచ్చే వారం ఎలాగూ టయర్ 1, 2 హీరోల రిలీజులు లేవు. ఉన్నంతలో సమంత మా ఇంటి బంగారం మీద హైప్ ఉంది. యూత్ ని నమ్ముకుని దీవానా, బిచ్చగాడి బ్రాండ్ తో విజయ్ అంటోని వంద దేవుళ్ళు బరిలో దిగుతున్నాయి. లాంగ్ కంబ్యాక్ తో వడ్డే నవీన్ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుగా పలకరించబోతున్నాడు.

ఇవన్నీ టాక్ మీద ఆధారపడి వస్తున్నవి. పెద్ది కనక కొత్త వెర్షన్ బాగుందనే మాట తెచ్చుకుంటే ఇంకో వీకెండ్ దక్కుతుంది.అయినా ఈ పనేదో సెకండ్ వీక్ లోనే చేసి ఉంటే బాగుండేదన్న కామెంట్స్ లేకపోలేదు. ఇలా చేయడం కొత్తేమి కాదు. గతంలో మేజర్ థియేటర్ రన్ పూర్తయ్యాక ఎక్స్ ట్రా సీన్లు, పాటలు జోడించడం ఎప్పటి నుంచో ఉన్నదే. పుష్ప 2 ది రూల్ కు ఏకంగా ఇరవై నిమిషాలకు పైగా కలపడం అభిమానులు మర్చిపోలేదు. చూడాలి మరి పెద్ది ఎలాంటి ఫలితం ఇస్తాడో.