జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం ఆయనకే చెల్లింది. తాజాగా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ని వెరైటీగా అనౌన్స్ చేశారు అనిల్. జివి ప్రకాష్ కుమార్, అనంత శ్రీరామ్ ను మెడదాకా ఇసుకలో కప్పెట్టేసి వాళ్ళను ఏ రకంగా సతాయించేది అందులో శాంపిల్ చూపించారు.

ఇది అనిల్ రావిపూడి స్వంతంగా ప్లాన్ చేసుకుంది కాదు. తెలివిగా జంధ్యాల గారి వివాహ భోజనంబు సినిమాలో సుత్తి వీరభద్రరావు – బ్రహ్మానందం కాంబినేషన్ లో ఉండే బీచ్ కామెడీని తీసుకుని ఇక్కడ వాడేసుకున్నారు. క్రెడిట్స్ సమస్య లేకుండా ప్రోమో ప్రారంభంలో ఒరిజినల్ సన్నివేశాన్ని యథాతధంగా చూపించి దాని తర్వాత అసలు మ్యాటర్ లోకి వెళ్లిపోయారు. ఆల్రెడీ ఒక ట్యూన్, సాహిత్యం అయిపోయిందనే హింట్ ఇందులో చెప్పకనే చెప్పారు.

వచ్చే వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించబోతున్న ఈ మల్టీస్టారర్ ఎట్టి పరిస్థితుల్లో 2027 సంక్రాంతికి విడుదల చేసే తీరాలనే టార్గెట్ తో ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టే వెంకటేష్ సహకారం పూర్తిగా ఉంటుంది కాబట్టి అనిల్ ఆ ధీమాతోనే రిలీజ్ పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఇద్దరు హీరోలు బావ బావమరుదులుగా నటించబోతున్నట్టు సమాచారం. శ్రీనిధి శెట్టి, కృతి శెట్టి వీళ్ళ సరసన భార్యలుగా కనిపించబోతున్నారు. ఈ నలుగురి మధ్య ఫన్ కీలకం కానుంది.

ప్రస్తుతం ఆదర్శ కుటుంబం చివరి దశ పనుల్లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపుగా వెంకటేష్ పోర్షన్లు పూర్తి చేశారట. ఇంకొంత బ్యాలన్స్ భాగం ఆగస్ట్ కల్లా పూర్తి చేసి సెప్టెంబర్ మూడో వారంలోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని ఫిక్స్ చేసుకున్నారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ పదహారు లేదా పదిహేడు రిలీజ్ అనుకున్నారట. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైన పక్షంలో కేవలం మూడు నెలల గ్యాప్ లో వెంకటేష్ రెండు సినిమాలు వచ్చేస్తాయి.