50 రూపాయల టికెట్ల ఐడియా భలే ఉంది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్ కు రాకుండా అడ్డుపడుతున్న వాటిలో ఓటిటి, ఇంటర్ నెట్ కన్నా ముందు చెప్పుకోవాల్సిన పాయింటు టికెట్ రేట్లు. ముఖ్యంగా నగరాల మల్టీప్లెక్సుల్లో సగటున ఒక టికెట్ రెండు వందల నుంచి ఆరేడు వందల రూపాయల వరకు ఉండటం వల్ల కుటుంబం మొత్తం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇష్టమైన హీరో, అదిరిపోయే టాక్ ఉంటే తప్ప ఫ్యామిలీస్ గంపగుత్తగా హాళ్లకు వెళ్లడం లేదన్నది వాస్తవం. దీని కోసం బాలీవుడ్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు వేస్తోంది.

తాజాగా రిలీజైన మనోజ్ బాజ్ పాయ్ గవర్నర్ మూవీకి కేవలం 50 రూపాయల టికెట్ పెట్టడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా మొదటి 25 వేల టికెట్లను అతి తక్కువ ధరకు పెట్టడం వల్ల ఎక్కువ శాతం ఆడియన్స్ వస్తారనే నిర్మాతల ఆలోచన మంచి ఓపెనింగ్స్ తెచ్చేలా ఉంది. దీనికి కారణం లేకపోలేదు. 1990 టైంలో మన దేశంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి అప్పటి గవర్నర్ ఎస్ వెంకటరమణన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే మెయిన్ స్టోరీ.

స్టోరీ బ్యాక్ డ్రాప్ 90 దశకానికి సంబంధించినది కాబట్టి టికెట్ రేట్లు కూడా అలాగే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్లాన్ అమలు పరిచారన్న మాట. ఇలాంటి కొత్త ఆలోచనలు మనమూ చేయాలి. మూడు నెలలకో సినిమా 99 రూపాయల ఆఫర్ అంటూ ఊరించడం కాదు. క్రమం తప్పకుండ ఇలాంటి స్ట్రాటజీలతో జనాన్ని రప్పించే ప్రయత్నాలు చేయాలి. గవర్నర్ కి చిన్మయ్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా అదా శర్మ మరో ప్రధాన పాత్ర పోషించింది.

ప్యాన్ ఇండియా సినిమాలకు వంద నుంచి నూటా యాభై రూపాయల వరకు పెంపు తీసుకునే నిర్మాతలు తక్కువ బడ్జెట్ తో తీసిన వాటికి ఇలా యాభై లేదా వంద రూపాయల టికెట్లు పెట్టడం ద్వారా థియేటర్లకు ఎక్కువ జనాన్ని వచ్చేలా చేసుకోవచ్చు. అయినా ఆన్ లైన్ లో ఉచితంగా దొరికే పాత సినిమాల రీ రిలీజులకే కొత్త రేట్లతో అభిమానులను క్యాష్ చేసుకుంటున్న వ్యవస్థలో ఇలాంటి మార్పులు ఆశించడం అత్యాశే అవుతుంది కానీ ఏదో ఒక రోజు మార్పు దొరక్కపోదా అనే నమ్మకంతో మూవీ లవర్స్ ఉన్నారు.